iDreamPost
iDreamPost
మరికొన్ని గంటల్లో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పార్టీల పరంగా చూసుకుంటే టీడీపీకి ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారి టెన్షన్ పెడుతోంది. అధికార పార్టీకి ధీటుగా ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో చెమటోడ్చిన ఆ పార్టీని బీజేపీ-జనసేన కూటమి కలవరపాటుకు గురిచేస్తోంది. తన సంప్రదాయ ఓటు బ్యాంకును ఆ కూటమి చీల్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లయినా ఇప్పుడు వస్తాయో.. రావోనన్న భయం పట్టుకుంది.
నాటి పసుపు కుంకుమ ఇప్పుడు లేదు
2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి 37 శాతం ఓట్లు లభించాయి. అప్పటికంటే ఇప్పడు తమకు ఓటింగ్ బాగా పెరుగుతుందని ఆ పార్టీ
నేతలు చెబుతున్నా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు. ఎటు తిప్పి ఎలా లెక్క వేసిన 30 శాతం ఓట్లు లభిస్తే గొప్ప అన్నట్లుంది. ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి 40 శాతం ఓట్లు, సీట్లు వచ్చాయని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు.
పార్టీ రహితంగా జరిగిన ఆ ఎన్నికల్లో ఎవరు ఏం చెప్పినా చెల్లుతుంది. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబు ప్రకటనలోని డొల్లతనాన్ని, టీడీపీ దీనావస్థను కళ్ళకు కట్టాయి. మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని తిరుపతి నగర పాలకసంస్థతో పాటు.. అన్ని మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది.
Also Read : తిరుపతి బై పోల్ : మమా అనిపించారు..!
ఇక సార్వత్రిక ఎన్నికల ముందే అప్పటి బాబు ప్రభుత్వం పసుపు కుంకుమ పేరుతో మహిళల ఖాతాల్లో నగదు జమచేసింది. ఆ విధంగా కొన్ని ఓట్లు అదనంగా రాబట్టుకోగలిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి పడిన 37 శాతం ఓట్లలో అవి కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఆ పసుపు కుంకుమ తాయిలం లేకపోగా.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు అన్నిపథకాల్లోనూ మహిళలనే లబ్ధిదారులను చేస్తున్నందున ఆ ఓట్లన్నీ అధికార పార్టీ అభ్యర్థికే పడతాయని స్థానిక సంస్థల ఎన్నికలతో స్పష్టమైంది. ఈ లెక్కన గత ఎన్నికల కంటే ఈసారి టీడీపీ ఓట్లలో ఎలా లేదన్నా ఐదు నుంచి ఆరు శాతం కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీతోనూ ముప్పు..
జనసేన మద్దతుతో బరిలో నిలిచి సవాల్ చేస్తున్న బీజేపీ వల్ల వైఎస్సార్సీపీ కంటే టీడీపీకే ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందుతున్నవారు ఎటూ వైఎస్సార్సీపీకే ఓటు వేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమైనా ఉంటే మామూలుగా అయితే టీడీపీకి పడాలి. కానీ రంగంలో ఉన్న బీజెపీ ఆ ఓట్లను బాగా చీల్చి తనకు మళ్లించుకోవాలని చూస్తుంది. ఇది టీడీపీకే నష్టదాయకం.
మరోవైపు టీడీపీ సంప్రదాయక ఓటు బ్యాంకుకు సైతం కమలం కన్నం పెడుతోంది. తిరుపతిలో గణనీయంగా ఉన్న బలిజ సామాజికవర్గం మొదటి నుంచి టీడీపీకి అండగా ఉంటోంది. ఇప్పుడు ఆ సామాజికవర్గం ఓట్లు పవన్ కల్యాణ్ మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థికి పడనున్నాయి. ఈ మేరకు టీడీపీ ఓట్లు తగ్గిపోనున్నాయని అంచనా. అధికార వైఎస్సార్సీపీ తన సంప్రదాయ ఓటు బ్యాంకు తోపాటు.. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లతో పటిష్టంగా కనిపిస్తుండగా.. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, ఇటు తన ఓటు బ్యాంకును నిలబెట్టుకోలేక టీడీపీ రెండు విధాలా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read : అచ్చెన్నను చూస్తుంటే.. లోకేశ్ పరిస్థితేంటో..?