iDreamPost
android-app
ios-app

ఏం ప‌రిస్థితి తెచ్చావ‌య్యా బాబూ…!

ఏం ప‌రిస్థితి తెచ్చావ‌య్యా బాబూ…!

మండ‌ల‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీలో లేక‌పోవ‌డం చంద్ర‌బాబుకు, ఇత‌ర నేత‌ల‌కు ఎలాగుందోకానీ తెలుగు త‌మ్ముళ్లు మాత్రం నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. కొత్త కొత్త ప్ర‌చారాలు చేయాల్సి వ‌స్తోంది. రాజ‌కీయాల్లో జ‌ర‌గ‌ని వింత‌లు, విశేషాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సాధార‌ణంగా ఏ పార్టీ అయినా ఎన్నిక‌లంటే ఆటో/‌రిక్షా ల ద్వారా ప్ర‌చారం చేస్తూ మా పార్టీకి ఓటెయ్యండి.. మా పార్టీ అభ్య‌ర్థిని గెలిపించండి.. అంటూ కోరుతుంది. ఇదేం విచిత్ర‌మో ఓ చోట తెలుగుదేశం నేత‌లు ఆటో పెట్టుకుని, దానికి తెలుగుదేశం జెండాలు క‌ట్టి ఏమ‌ని ప్ర‌చారం చేశారో తెలుసా..!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ. ఆ ఊరిలో ఓ ఆటో ఎన్నికల ప్రచారం కోసం తిరుగుతోంది. అది తెలుగుదేశం పార్టీ అద్దెకు తీసుకున్న ఆటో. అందులో ఓ వ్యక్తి మైక్ పట్టుకొని కూర్చొని ‘దయచేసి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి. దయ చేసి వినండి..’ అంటూ చెప్పుకుంటూ పోతున్నాడట. ఇది విన్న వారికి కాసేపు ఏమీ అర్థంకాక నెత్తిగోక్కున్నారు. సహజంగా ఎన్నికల ప్రచారం అంటే.. ఎవరైనా తమ పార్టీకి ఓటు వేయమని కోరుతారు. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయొద్దని కూడా అంటారు. కానీ.. సొంత పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దని ఎవరైనా కోరుతారా? అధికారికంగా ప్రచారం చేస్తారా? బహుశా రాష్ట్రచరిత్రలో ఇలా ఎప్పుడూ జరగకపోవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దంటూ ఆ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది.

విషయం ఏమంటే.. తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించినట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికిముందే పలువురు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో.. టీడీపీ అభ్యర్థులు బరిలో నిలినట్టైంది. ఆ తర్వాత ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించినప్పటికీ.. అభ్యర్థుల గుర్తు బ్యాలెట్ లో ఉండనుంది. అందువల్ల.. ఎవరైనా ఓటు వేస్తారేమోనని ఓ ఆటో కట్టించుకొని దానికి మైకు తగిలించుకొని మరీ తమ అభ్యర్థులకు ఓటు వేయొద్దంటూ ప్రచారం చేశారు టీడీపీ నేతలు! ఇది చూసిన జనాలు ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు.

ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చాలా ప్రాంతాల్లో తాము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే కార్య‌క‌ర్త‌లు, చోటా మోట నేత‌లు చాలా మందే ఉన్నారు. సంద‌ర్భం వ‌చ్చిందంటే ప‌సుపు చొక్కాలు వేసుకుని మ‌రీ రంగంలోకి దిగుతారు. వ‌రుస ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వుతున్నా, భ‌విష్య‌త్ పై ధీమాతో కాలం వెళ్ల‌దీస్తున్నారు. అలాంటి వాళ్లు అంద‌రూ వైసీపీ హ‌వా కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఎంపీటీసీ, జ‌డ్‌పీటీసీ ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌య్యారు. అధినేత హూ అన‌గానే రంగంలోకి దిగి ప్ర‌చారం మొద‌లు పెడ‌దామ‌నుకున్నారు. తీరా.. ఆయ‌న హు అన‌కుండా సైలెంట్ గా ఉన్నా ఇన్ని బాధ‌లు ఉండ‌క‌పోయేవి. ఏకంగా తాము ఎన్నిక‌లను బ‌హిష్క‌రిస్తున్నాం అని స్టేట్ మెంట్ ఇచ్చి పార్టీలో అల్ల‌క‌ల్లోలం సృష్టించారు.