iDreamPost
android-app
ios-app

TDP – BJP : బద్వేల్‌ ఉప ఎన్నిక : టీడీపీ అందుకే తప్పుకుందా..?

TDP – BJP : బద్వేల్‌ ఉప ఎన్నిక : టీడీపీ అందుకే తప్పుకుందా..?

రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం. ఆ అధికారం చేజిక్కించుకునేందుకు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా రాజకీయాలు చేస్తుంది. కొన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తాయి. మరికొన్ని పార్టీలు ఇతర పార్టీలతో పొత్తు లేకుండా అధికారంలోకి రాలేవు. ఈ కోవకు చెందినదే చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ. 2019 సాధారణ ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లు అయినా.. టీడీపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగపడలేదు. పైగా అధికార వైసీపీ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో మరో రెండున్నరేళ్లలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి నెగ్గుకురాలేమనే అంచనాకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఎన్నికలు అయిపోయిన కొద్ది రోజులకే కేంద్రం (బీజేపీ)తో విభేదించి నష్టపోయామంటూ మాట్లాడిన చంద్రబాబు.. అప్పటి నుంచి బీజేపీకి దగ్గర కావడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న బద్వేలు ఉప ఎన్నికను.. చంద్రబాబు బీజేపీతో స్నేహం అందుకునేందుకు ఒక సాధనంగా ఉపయోగించుకున్నారని ఉప ఎన్నికల్లో జరిగిన పరిణామాల ద్వారా తెలుస్తోంది.

ఏపీలో బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పటికీ అలానే ఉంది. ఈ విషయం తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో జనసేన మద్ధతుతో పోటీ చేసిన బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 57 వేలు మాత్రమే. ఈ గణాంకాలు బీజేపీ పరిస్థితిని తెలియజేస్తున్నాయి.

Also Read : Chandrababu Kuppam Tour – బాబుగారి చిత్రగుప్తుడి అవతారం

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. దాన్ని ఆధారంగా చేసుకుని బీజేపీతో పొత్తు కోసం బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకునే అస్త్రాన్ని ఉపయోగించారు. నోటిఫికేషన్‌ రాక ముందే అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం వెనుక.. బీజేపీతో స్నేహం కోసమేనని తెలుస్తోంది. బద్వేలులో పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా.. టీడీపీ ఓట్లు బీజేపీకి పడేలా చేస్తున్నారు. బీజేపీ తరఫున టీడీపీ కార్యకర్తలే ఏజెంట్లుగా కూర్చున్నారు. గత ఎన్నికల్లో బద్వేలులో బీజేపీకి కేవలం 750 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్లు బీజేపీకి వేయించడం ద్వారా ఆ పార్టీకి 30– 40 వేల ఓట్లు వస్తే.. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని బాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేపించవచ్చు. ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఈ పరిణామాలు బీజేపీకి సంతోషాన్ని ఇస్తాయనడంలో సందేహంలేదు.

ఈ తతంగం నడిపించిన తర్వాత.. చంద్రబాబు మరోసారి బీజేపీ వద్ద పొత్తు ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తే.. బాబు పొత్తు ప్రతిపాదనపై బీజేపీ సానుకూలంగా ఆలోచించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తున్న బాబు లక్ష్యం నెరవేరినట్లే. మరి బద్వేలు ఉప ఎన్నిక ద్వారా బాబు అమలు చేస్తున్న ఈ వ్యూహం సఫలమవుతుందా..? విఫలమవుతుందా..? తెలియాలంటే.. మరికొన్ని నెలలు ఆగాలి.

Also Read : Badvel By Poll -బద్వేలు ఉప ఎన్నికలు – బీజేపీ తరుపున ఏజెంట్లుగా కూర్చున్న టీడీపీ నేతలు