iDreamPost
android-app
ios-app

ఎప్పుడు చెప్పాల్సింది.. ఎప్పుడు చెబుతున్నారు అచ్చెం నాయుడు..?

ఎప్పుడు చెప్పాల్సింది.. ఎప్పుడు చెబుతున్నారు అచ్చెం నాయుడు..?

ఈ రైలు జీవితకాలం లేటు.. అన్నట్లుగా ఉంది టీడీపీ నేతల రాజకీయం. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకుంటారు. ఎన్నికల సమయంలో మేము ఈ పనులు చేశామని చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ టీడీపీ నేతలు ఈ రెండు పనులు చేయలేదు. ఎన్నికల సమయంలో చెప్పాల్సిన విషయాలను అధికారం పోయిన తర్వాత.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఏకరవు పెడుతున్నారు. వైసీపీ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు.. తాము ఎప్పుడో చేశామని చెప్పుకుంటూ వైసీపీకి వచ్చే మైలేజ్‌ను తగ్గించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నుంచి అచ్చెం నాయుడు వరకూ ఇదే పంథాను అవలంభిస్తూ రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

వైసీపీ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు తామే చేశామని టీడీపీ నేతలు చెప్పుకునే జాబితాలో దిశ యాప్‌ కూడా చేరిపోయింది. ఆపద సమయంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను వైసీపీ ప్రభుత్వం తెచ్చింది. మహిళలు తమ మొబైల్‌ ఫోన్‌లో సదరు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. రక్షణ కావాల్సిన సమయంలో బటన్‌ నొక్కితే పోలీసులు నిమిషాల వ్యవధిలో వారున్న చోటుకు వెళతారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో దిశ యాప్‌ను ప్రవేశపెట్టిన జగన్‌ సర్కార్‌.. ఆ యాప్‌ను మహిళలు అందరూ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు.

దిశ యాప్‌కు మంచి ఆదరణ వస్తోంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చేస్తున్న పనికి ప్రజల్లో మంచి పేరు లభిస్తోంది. దీంతో ప్రజల దృష్టిని మరలచ్చేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఈ సారి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు వంతు వచ్చింది. చంద్రబాబు ప్రణాళికనే జగన్‌ అమలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 2015లోనే తమ ప్రభుత్వం ఫోర్త్‌ లయన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా ట్రాక్‌మై ట్రావెల్‌ పేరుతో ఎస్‌వోఎస్‌ను రూపొందించామని, ఆపదలో ఉన్న మహిళలు ఆ బటన్‌ నొక్కితో పోలీసులు వస్తారని అచ్చెం నాయుడు వివరించారు. టెక్నాలజీని వినియోగించడంలో ముందుండే చంద్రబాబు.. మహిళల భద్రత గురించి ఆలోచించే ఫోర్త్‌ లయన్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారని చెప్పుకొచ్చారు.

అధికారంలో ఉన్నప్పుడు లేదా ఎన్నికల సమయంలో చెప్పుకోవాల్సిన అంశాన్ని అచ్చెం నాయుడు ఇప్పుడు చెబుతుండడం వినేవారికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు, ఎన్నికల సమయంలోనూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పరిమితమైన టీడీపీ నేతలు.. అధికారం పోయిన తర్వాత.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆ పనులు తాము ఎప్పుడో చేశామని చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉంది. ఈ పని వల్ల వచ్చే లాభం ఏమిటో టీడీపీ నేతలకే తెలియాలి.

Also Read : కామెడీగా మారిన చంద్ర‌బాబు సీరియ‌స్ దీక్ష‌