iDreamPost
iDreamPost
ఏపీలో పరిస్థితి ఆసక్తిగా మారింది. అన్నీ రివర్స్ టెండరింగ్ అన్నట్టుగా పాలనా వ్యవహారాలు కూడా రివర్స్ లో నడుస్తున్నాయి. సహజంగా దర్యాప్తు జరపమని ప్రతిపక్షం అడుగుతుంటే పాలకపక్షం కాలయాపన చేస్తుంది. కానీ ఏపీలో దానికి భిన్నమైన అనుభవం ఇప్పటికే చూశాం. ఇప్పుడు ఎన్నికలు జరపాలని అధికార పార్టీ తహతహలాడుతుంటే, వాయిదా వేయించాలనే యత్నంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాంతో స్థానిక ఎన్నికల సమరం చర్చనీయాంశంగా మారింది. పోటీకి ముందే విపక్షం చేతులెత్తేస్తుందా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా ఉందని ఊరూవాడా ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్న చంద్రబాబు తీరా ప్రజల నాడి పసిగట్టే ఎన్నికలకు మాత్రం వాయిదా వేయించే యత్నంలో ఉన్నట్టు అంతా భావిస్తున్నారు.
ఏపీలో 2018 నుంచి స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దానికారణంగా స్థానిక సంస్థల నిధులు మురిగిపోతున్నాయి. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఈనెలాఖరుతో గడువు ముగుస్తోంది. సకాలంలో పాలకవర్గాలు పగ్గాలు చేపట్టకపోతే సుమారుగా 4వేల కోట్ల రూపాయల నిధులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం నిధులను సద్వినియోగం చేసుకోవడానికి సర్కారు సమాయత్తం అయ్యింది అయితే టీడీపీ నేతలు బీసీ రిజర్వేషన్ల విషయంలో పిటీషన్ దాఖలు చేయడంతో ఎన్నికలకు బ్రేకులు పడ్డాయి. చివరకు విచారణ జరిగి , తుది తీర్పు రావడంతో హైకోర్ట్ ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమయ్యింది.
తొలుత హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరిలో రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం ఏర్పడింది. కానీ తీరా సుప్రీంకోర్ట్ కి వెళ్లి రివ్యూ కోరిన టీడీపీ వ్యవహారం చివరకు మార్చి వరకూ సాగి రిజర్వేషన్ల సవరణకు అనివార్యం అయ్యింది. దాంతో 59 శాతం రిజర్వేషన్లను మార్చి 50శాతానికే పరిమితం చేయాల్సి వచ్చింది. కొత్తగా రిజర్వేషన్లు రూపొందించి ఎన్నికలకు వెళ్లేందుకు అంతా సిద్ధమయిన వేళ మళ్లీ తాజాగా టీడీపీ సుప్రీంకోర్ట్ మెట్లు ఎక్కింది. ఆపార్టీ తరుపున ఈసారి నేరుగా ఎంపీ రామ్మెహన్ నాయుడు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ కలిసి పిటీషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ ఇప్పుడు ఏపీలో స్థానిక సమరానికి బ్రేకులు వేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
బీసీల రిజర్వేషన్లు పెంచడాన్ని పరోక్షంగా అడ్డుకున్న టీడీపీ, ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ ప్రత్యక్షంగా కోర్టుకి వెళ్లడమే ఆసక్తికరం. ఏదో కారణం చూపించి ఏపీలో ఎన్నికలు జరగకూడదనే లక్ష్యంతో ఆపార్టీ ఉన్నట్టు స్పష్టమవుతోందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న పార్టీ స్థానిక సమరంలో కూడా పట్టు కోల్పోతే ఇక కోలుకునే అవకాశం ఉండదనే సందేహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో బీసీ రిజర్వేషన్ల సాకుతో ఎన్నికలను అడ్డుకునేయత్నంలో ఉందని అంతా భావిస్తున్నారు. నిజంగా టీడీపీకి బీసీల మీద ప్రేమ ఉంటే హైకోర్టులో రిజర్వేషన్ల మీద విచారణ సమయంలో ఎందుకు ఇంప్లీడ్ కాలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. అప్పుడు , ఇప్పుడూ కాలయాపన చేసే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఎలా స్పందిస్తుందన్న దానిపై ఏపీలో లోకల్ వార్ ఆధారపడి ఉంటుంది. ఏమయినా టీడీపీ లక్ష్యం నెరవేరుతుందా లేక వ్యూహం బెడిసికొట్టి అసలుకే ఎసరు పెడుతుందా అన్నది చూడాలి.