Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో అరెస్ట్ అయిన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేతల అండ కరువైంది. హత్య కేసులో నేర నిరూపన నిర్థారణ ఇంకా కాకపోయినా కొల్లు రవీంద్రకు కనీసం సీనియర్ల పరామర్శ కరువైంది. ప్రెస్ స్టేట్‌మెంట్లు, ట్విట్టర్‌లో ఖండనలతో సరిపెట్టిన చంద్రబాబు, లోకేష్‌ల బాటలోనే తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సీనియర్లు నడుస్తున్నట్లుగా నిన్న జరిగిన ఘటన తేటతెల్లం చేసింది.
కొల్లు రవీంద్రకు ఆది నుంచి అండగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు జైలులో ఉన్న కొల్లును పరామర్శించేందుకు నిన్న రాజమండ్రికి వెళ్లారు. కరోనా కారణంగా ఖైదీలను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయితే దేవినేనితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు అతి కొద్ది మందే కొల్లు రవీంద్రను పరామర్శించేందుకు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ ఆదిరెడ్డి అప్పారావు, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌లు మాత్రమే దేవినేని వెంట ఉన్నారు.
మత్య్సకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు తూర్పుగోదావరి జిల్లా ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మద్ధతు మినహా మరెవరూ అండగా లేనట్లుగా స్పష్టమైంది. టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా నగరంలో ఉన్నా జైలు వద్దకు రాలేదు. నిందితులచేత కొల్లు రవీంద్ర పేరును పోలీసులు చెప్పించారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా కొల్లును పరామర్శించేందుకు రాకపోవడం గమనార్హం. మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి నగరానికి చెందిన నేత, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కూడా డుమ్మా కొట్టారు. వీరందరూ కావాలనే గైర్హాజరైనట్లుగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
పలు కేసుల్లో ఇటీవల వరకూ జైలులో ఉన్న మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పరామర్శించేందుకు మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయడుతో సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సెంట్రల్ జైలుకు వెళ్లారు. అయితే పార్టీ నేత, మాజీ మంత్రిని పరామర్శించేందుకు మాత్రం వారెవరూ రాకపోవడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. హత్య కేసులో కొల్లు పాత్ర ఉందని వారందరు నిర్థారించుకోవడం వల్లనే దూరంగా ఉన్నారా..? అనే సందేహాలు ఆ పార్టీ శ్రేణుల్లో కలుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్‌లు కూడా కొల్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు, ధైర్యం చెప్పేందుకు కూడా వెళ్లకపోవడం ఈ పరిస్థితికి కారణమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారంలో మత్య్సకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు పార్టీ నుంచి మద్ధతు కరువైందని తాజా ఘటనతో స్పష్టమవుతోంది.