iDreamPost
android-app
ios-app

అస‌లు మాని కొస‌ర్ల‌తో టీడీపీ మేనిఫెస్టో

అస‌లు మాని కొస‌ర్ల‌తో టీడీపీ మేనిఫెస్టో

ఎలాగైనా ప్రాభ‌వం నిలుపుకోవ‌డానికి తెలుగుదేశం పార్టీ నానా అవ‌స్థ‌లు ప‌డుతోంది. అయితే, ఆ ఒత్తిడిలో మ‌రిన్ని పొర‌పాట్లు చేస్తూ అబాసుపాల‌వుతోంది. పార్టీల‌కు అతీతంగా జ‌రిగే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు మేనిఫెస్టో రిలీజ్ చేసి నవ్వుల పాలైంది. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న పార్టీ అధినేత ఉన్న పార్టీ క‌నీస అవ‌గాహ‌న లేకుండా మేనిఫెస్టో రిలీజ్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

అద‌లా ఉంటే.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మేనిఫెస్టో విడుద‌ల చేసిన టీడీపీ వాటిలోని అంశాల‌ను ప‌రిశీలిస్తే పెద్ద‌గా క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. మేనిఫెస్టో చాలా విచిత్రంగా అనిపిస్తోంది. మూడు సార్లు అధికారంలో ఉన్న కాలంలో చేసిన విష‌యాల‌న్నింటినీ వ‌దిలేసి అధికారం కోల్పోవ‌డానికి కొద్ది నెల‌ల ముందు తెర‌పైకి తెచ్చిన అంశాల‌నే అందులో పొందు ప‌రిచింది.

జాబు కావాలంటే బాబు రావాలంటూ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ఊక‌దంపుడు స్టేట్ మెంట్లు, విప‌రీతంగా ప్ర‌చారం చేయ‌డం టీడీపీకి అల‌వాటుగా మారింది. గ‌త రెండు ప‌ర్యాయాలు అదే జ‌రిగింది. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా అలాంటి అంశాన్నే పొందుప‌రిచింది. నిరుద్యోగ యువత కోసం ప్రతి 6 నెలలకు జాబ్ మేళా నిర్వ‌హిస్తుంద‌ట‌. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల‌కే మూడున్న‌ర‌ ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించి నిరుద్యోగుల మ‌న‌సులు ఇప్ప‌టికే దోచుకున్నారు. టీడీపీ మ‌ళ్లీ దాన్ని మేనిఫెస్టోలో చేర్చ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయనగా చివరి ఆరుమాసాల్లో అర్జంటుగా నిరుద్యోగ భృతి అంటు హడావుడి చేశారు. అలాంటి టీడీపీ ఇపుడు మున్సిపాలిటీల్లో గెలవగానే నిరుద్యోగ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పటం ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేకుండా నిరుద్యోగ మేళా నిర్వహించలేరన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా మున్సిపాలిటీల్లో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా అందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం అవసరమే.

అలాగే ఐదేళ్ళు అధికారంలో ఉన్నపుడు అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చంద్రబాబునాయుడుకు రాలేదు. నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరి ఏడాదిలో మాత్రమే అదికూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హడావుడిగా అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చెప్పారు. కానీ మొదటి నాలుగేళ్ళ పాటు దాని ఊసే ఎత్తలేదు. కేంద్రప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఆర్ధికసంఘం నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామంటు లోకేష్ ఇపుడు చెప్పటమే విడ్డూరంగా ఉంది. మరి అధికారంలో ఉన్నపుడు కేంద్రప్రభుత్వం నుండి ఆర్ధికసంఘం నుండి నేరుగా వచ్చిన నిధులతో ఎన్ని మున్సిపాలిటీలను డెవలప్ చేశారో లోకేష్ చెప్పాలి.

ఆచరణ సాధ్యంకాని అనేక హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఉండదు. మొన్ననే ముగిసిన పంచాయితి ఎన్నికలకు కూడా ఇలాంటి మ్యానిఫెస్టోనే చంద్రబాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. మ్యానిఫెస్టో ప్రకారం అన్న క్యాంటిన్లను మళ్ళీ తెరిపించి 5 రూపాయలకే భోజనం పెడతారట. పాత ఆస్తిపన్ను బకాయిలను రద్దు చేస్తారట. ప్రస్తుత పన్నును సగానికి సగం తగ్గిస్తారట. శుభ్రమైన ఊరు శుద్దమైన నగరం కొళాయిల ద్వారా మంచినీటి సౌకర్యం ఉద్యోగ మేళా పారిశుధ్య కార్మికుల వేతనాన్ని రూ. 21 వేలక పెంచటం లాంటి అనేక హామీలిచ్చారు. రెండు రోజులుగా ఈ మేనిఫెస్టోపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కొంత మంది అభ్య‌ర్థులు దీన్ని ప్ర‌చారంలో వాడేందుకు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.