iDreamPost
android-app
ios-app

TDP, MLA Payyavula Keshav, BJP – బీజేపీ అంటే.. భారతీయ జగన్‌ పార్టీ అంటున్న టీడీపీ నేత

TDP, MLA Payyavula Keshav, BJP – బీజేపీ అంటే.. భారతీయ జగన్‌ పార్టీ అంటున్న టీడీపీ నేత

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైంది మొదలు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి, ఆ పార్టీ నేతల వరకు ఎవరూ కూడా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనలేదు. ఎన్నికలకు ఏడాది ముందు పొత్తు తెంచుకున్న టీడీపీ, ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చతికిలపడిపోయింది. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఏకైక మార్గమనే భావనకు ఆదిలోనే చంద్రబాబు అండ్‌ టీం వచ్చింది. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు. దూషించిన నోళ్లతోనే మోడీ, అమిత్‌షాలపై ప్రశంసల వర్షం కురిపించారు చంద్రబాబు. పొత్తు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

రాష్ట్ర బీజేపీ నేతలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పలు సందర్భాల్లో టీడీపీని, ఆ పార్టీ అధినేతను నేరుగా విమర్శించినా.. ఎవరూ స్పందించలేదు. అవినీతి ఆరోపణలు చేసినా.. బాబుతో సహా టీడీపీ నేతలందరూ కిమ్మనకుండా ఉన్నారు. రెండున్నరేళ్లుగా బీజేపీ పట్ల ఇలాంటి వైఖరిని అవలంభించిన టీడీపీ నేతలు.. ఈ రోజు ఒక్కసారిగా స్టాండ్‌ మర్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌.. బీజేపీపై ఘాటు విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. జగన్‌ ప్రభుత్వంపై బీజేపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడడం లేదంటూ మొదలు పెట్టిన పయ్యావుల.. బీజేపీ అంటే.. భారతీయ జగన్‌ పార్టీ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం దేవాలయం ధర్మకర్త అశోక్‌ గజపతి రాజుపై దాడి జరిగినా, హిందుత్వ అంశాలపై బీజేపీ స్పందించడం లేదన్నారు పయ్యావుల. కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లిస్తున్నా.. బీజేపీ నేతలు స్పందించడం లేదని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

పయ్యావుల విమర్శలు విన్నవారు.. ఒక్కసారిగా బీజేపీ పట్ల టీడీపీలో వచ్చిన ఈ మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికిప్పుడు పయ్యావుల ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు..? అనే ప్రశ్న వేసుకుంటే.. బీజేపీ నేతలను రెచ్చగొట్టేందుకేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు సాయంత్రం విజయవాడ సిద్ధార్థ కాలేజీ ప్రాంగణంలో బీజేపీ ‘ప్రజాగ్రహ సభ’ నిర్వహిస్తోంది. ఈ సభలో జగన్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు విమర్శలు చేసేందుకు సిద్ధమయ్యారని.. ఇటీవల ఆ పార్టీ నేతలు మాట్లాడిన తీరును బట్టి అర్థమవుతోంది. ఎలాగూ బీజేపీ నేతలు ఈ సభలో జగన్‌ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తారు. అయినా.. పయ్యావుల బీజేపీ నేతలను రెచ్చగొట్టేలా.. ఏకంగా బీజేపీ పార్టీ పేరునే మార్చేస్తూ.. భారతీయ జగన్‌పార్టీ అనడమే ఆసక్తికరమైన అంశం. బీజేపీ నేతలు.. జగన్‌ సర్కార్‌పై భారీగా విమర్శలు చేస్తే.. ఆ తర్వాత.. బీజేపీతో టీడీపీ పొత్తు ప్రయత్నాలు సఫలమవుతాయనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబే.. పయ్యావుల చేత ఇలా మాట్లాడించారా..? అనే సందేహాలు లేకపోలేదు.

Also Read : బాబు.. ఇక బీసీలను ఉద్ధరిస్తారట!