iDreamPost
android-app
ios-app

పట్టాభి నోట.. అదే తీట

  • Published Feb 01, 2022 | 4:42 AM Updated Updated Feb 01, 2022 | 4:42 AM
పట్టాభి నోట.. అదే తీట

కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా చిన్నెలు చేస్తుందో అచ్చం అలాగే ప్రవర్తిస్తున్నారు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి. రాజకీయాల్లో అనామకుడు అయిన పట్టాభికి..తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ తగిలించి వదిలేయడంతో అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. సందర్భం ఏదైనా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్యక్షతన సోమవారం జరిగిన నారీ సంకల్ప దీక్షకు సంఘీభావం తెలపడానికి వెళ్లి పట్టాభి సందర్భశుద్ధి లేకుండా మాట్లాడి తన నోటి తీటను బయటపెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కృషి చేశారన్నారు. కానీ, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఒక కాల్ మనీ వ్యాపారిగా మారిపోయారని తీవ్రమైన విమర్శచేశారు. రేషన్ షాపుల్లోనే ధరలు పెంచిన ఘనుడు జగన్ అని వ్యాఖ్యానించారు. 

బాబు చేసిన తప్పులు జగన్ ఖాతాలోకి..

చంద్రబాబు హయాంలో వివిధ వర్గాలకు చేసిన అన్యాయాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేద్దామని పట్టాభి తెగ తాపత్రయ పడిపోయారు. రుణాలపై వడ్డీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలను చంద్రబాబు దారుణంగా మోసగించారు. వాస్తవం ఇదైతే.. డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చంద్రబాబునాయుడు కృషి చేశారని పట్టాభి వక్రీకరించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కుంభకోణంలో టీడీపీ నేతలు పీకల్లోతు కూరుకుపోయిన సంగతి రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. దాన్ని కూడా వక్రీకరించి సీఎం జగన్ ఒక కాల్ మనీ వ్యాపారిగా మారిపోయారని నిరాధారమైన నిందను అలవోకగా వేసేశారు.

మహిళలకు చేసిన మేలు విషయంలో సీఎం జగన్ కు, చంద్రబాబుకు చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డ్వాక్రా రుణాల వడ్డీ చెల్లిస్తుండడమే కాక మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల భర్తీలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మహిళలకు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. వారి సాధికారత కోసం ఈ రెండున్నరేళ్లలో రూ.వేల కోట్లు ఖర్చు చేసింది. అదే చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో మహిళల సమస్యలు పట్టించుకోలేదు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకం అంటూ హడావిడి చేసి వారి ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఆయన మోసాన్ని గ్రహించిన మహిళలు గట్టిగా బుద్ది చెప్పారని వైఎస్సార్ నాయకులు గుర్తుచేస్తున్నారు.

రేషన్ షాపుల్లో ధరలు పెంచిన ఘనత బాబుదే..

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకంను అటకెక్కించి, దాని ధరను కిలో రూ.5.25 చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే అన్న సంగతి పట్టాభికి తెలియదా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ కిలో బియ్యం రూపాయికి తగ్గించింది. తమ ప్రభుత్వం కిలో బియ్యం రూపాయి చొప్పున ఇస్తూనే నాణ్యమైన రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్లకు తీసుకెళ్ళి అందజేస్తోందని, దీనిపై విమర్శలు చేసే నైతిక అర్హత టీడీపీ నేతలకు లేదని అంటున్నారు. ఒక స్థాయి లేని, కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవని పట్టాభి లాంటి వ్యక్తి అఖండ ప్రజాదరణతో, తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహనరెడ్డిపై అవాకులూ చవాకులూ మాట్లాడడం తగదని, చేతనైతే నిర్మాణాత్మక విమర్శలు చేయాలని సూచిస్తున్నారు.

.