iDreamPost
iDreamPost
సామాజిక బాధ్యతతో ప్రభుత్వ అవసరాలకు తక్కువ ధరకు సిమెంట్ సరఫరా చేయడం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపించి నవ్వులపాలైన లోకేష్ ఆద్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా
గత సంవత్సరం మార్చ్ 16 న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (APCMA) ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలవరం సహా పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని , భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే పలు నిర్మాణాలతో పాటు , పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లకు కూడా ఆనాడు ఉన్న మార్కెట్ ధర 380 కన్నా వీలైనంత తక్కువ ధరకు ఇమ్మని కోరడంతో APCMA వారు అందుకు అంగీకరించారు .
ఆ తర్వాత ప్రభుత్వం పలు విభాగాల కొనుగోలు కోసం ఐదు సంవత్సరాల సగటు ధరని ప్రామాణికంగా తీసుకొని APCMA అంగీకారంతో 50 కిలోల పిపిసి సిమెంట్ బ్యాగ్ ధరను రూ .225 గా ఓపిసి బ్యాగ్ ధరను 235 గా నిర్ణయిస్తూ 13 ఏప్రిల్ 2020 న జీవో నెంబర్ 22 విడుదల చేసింది . సదరు జీవో ప్రకారం ఆయా ప్రభుత్వ విభాగాలు తమకు అవసరమైన సిమెంట్ క్వాంటిటీని జిల్లా కలెక్టర్లకు పంపుతాయి , వారు వైయస్ఆర్ నిర్మాణ్ యాప్ ద్వారా AP సిమెంట్ తయారీదారుల సంఘం (APCMA) కు ఆర్డర్లు ఇస్తారు . APCMA తన అసోషియేషన్ లో ఉన్న ఇరవై మూడు సంస్ధల తయారీ , సరఫరా సామర్ధ్య ఆధారంగా ఆర్డర్లను విభజించి నిర్దేశిత ప్రాంతాలకు సరఫరా చేయమని కోరుతోంది .
ప్రస్తుత మార్కెట్ ధర కన్నా తక్కువకి సరఫరా చేసే ఈ ప్రక్రియలో సిమెంట్ కంపెనీలకు నష్టం ఉన్నా లేకున్నా మార్కెట్ ధరలో దాదాపు 40 శాతం అనగా షుమారు ఒక 50 కేజీలు బ్యాగ్ కి రూ.100 నుండి 120 రూపాయలు కోల్పోతున్నాయి. ఈ లెక్కన చూస్తే 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ భారతి సిమెంట్ ప్రభుత్వానికి సరఫరా చేసిన 228370.14 మెట్రిక్ టన్నులకు గాను షుమారు 46 కోట్లు ఆదాయాన్ని కోల్పోయింది భారతి సిమెంట్ .
ఒక వ్యక్తి అయినా , సంస్థ అయినా లాభాపేక్షతో ప్రభుత్వంతో అంతర్గతంగా లాలూచీ పడి ఆయాచిత లబ్ది పొందితే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు కానీ ఒక వ్యాపార సంస్థ సామాజిక బాధ్యతతో తన ఆదాయాన్ని 46 కోట్ల రూపాయల మేర కోల్పోయి ప్రభుత్వానికి సరఫరా చేసినదాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎలా అంటారో టీడీపీ వాళ్లే చెప్పాలి .
టీడీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో చంద్రన్న సంక్రాంతి , క్రిస్మస్ , రంజాన్ కానుకల పేరిట నెయ్యి , బెల్లం , ఇతర నిత్యావసరాలు తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ నుండి ప్రభుత్వం చేత కొనిపించి సరఫరా చేయగా పలు చోట్ల ముక్కి , కుళ్ళిపోయిన సరుకు వచ్చిందని లబ్ధిదారులు గగ్గోలు పెట్టిన విషయం పాఠకులు ఇంకా మర్చిపోయుండరు. అంతేకాక ఈ కానుకలకు పెద్ద మొత్తంలో అవసరమైన బెల్లాన్ని రాష్ట్ర రైతుల నుండి కాక గుజరాత్ నుండి నాసి రకం బెల్లం కొనుగోలు చేయడం పలు విమర్శలకు తావిచ్చింది. గుజరాత్ బెల్లమే బాబుకి రుచి అంటూ స్థానిక రైతులకు అన్యాయం చేస్తూ గుజరాత్ నుండి కొనుగోలు చేసిన విషయాన్ని పలు పత్రికలు దుయ్యబట్టాయి. ఈ కొనుగోళ్ళకు ముందు చంద్రన్న మజ్జిగ పధకం పేరిట ఎండాకాలం పేద వాళ్ళకి మజ్జిగ సరఫరా అంటూ టెండర్లు , కొటేషన్లు లేకుండా హెరిటేజ్ నుండి ప్రభుత్వం చేత కొనిపించిన మజ్జిగ ప్యాకెట్లు ఎవరికి సరఫరా చేశారో తెలియదు కానీ ఈ పధకం కింద రూ. 39 కోట్లు ఖర్చు చూపెట్టారు ….
ఇలా పలు సందర్భాల్లో తన కుటుంబ కంపెనీ ఉత్పత్తులు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించిన చంద్రబాబు ఏ ఒక్కసారి కూడా మార్కెట్ ధర కన్నా తగ్గించిన పాపాన పోలేదు. పోనీ తన కంపెనీ కాక మరెవరైనా తక్కువ ధరకు సరఫరా చేయమని మిగతా కంపెనీలని ఆహ్వానించిందీ లేదు . పోటీ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని స్వంత కంపెనీకి ఇచ్చుకొన్న వ్యాపారంలో కనీసపు సామాజిక స్పృహ చూపించకుండా అధిక ధరలకు ప్రభుత్వం నెత్తిన నాసిరకపు సరుకు అంటగట్టి విమర్శల పాలైన చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ పార్టీ సామాజిక బాధ్యతతో లాభాలు వదులుకొని ప్రభుత్వ నిర్మాణాల కోసం పేదల ఇళ్ల కోసం తక్కువ ధరకు సిమెంట్ అందిస్తున్న కంపెనీల పై ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ అసత్య ఆరోపణలు చేయడం నైతికంగా వారెంత పతనమయ్యారో తెలియజేస్తుంది .
ఈ ఆరోపణల దృష్ట్యా భారతి సిమెంట్ కంపెనీ కానీ , సిమెంట్ తయారీ దారుల సంఘం కానీ నిరసన వ్యక్తం చేసి ఒప్పందం నుండి తప్పుకొంటే ఆ కంపెనీలకు లాభమే కానీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ,MGNRGS పధకం కింద రాష్ట్రంలో పలు పనులు చేపట్టిన కేంద్రం పై కూడా అదనపు వ్యయం పడటంతో పాటు , ఈ నాలుగేళ్లలో 30 లక్షల పై చిలుకు ఇల్లు నిర్మించుకొనే పేదల గృహ వ్యయం కూడా అపరిమితంగా పెరిగిపోతుంది . తన రాజకీయ లబ్ది కోసం ఏ రంగం ఎంత నష్టపోయినా , వ్యవస్థల ఉనికి ప్రమాదంలో పడినా లెక్కలేకుండా అసత్య ఆరోపణలకు పూనుకొనే విధంగా తయారైన టీడీపీ పార్టీ ధోరణి విచారకరమే కాదు సభ్య సమాజానికి తీవ్ర ప్రమాదకరం …..