iDreamPost
android-app
ios-app

వైసీపీ ఓడిపోతుందనే జగన్‌ సభ రద్దు చేసుకున్నారట.. పరిటాల శ్రీరామ్‌ నయా లాజిక్‌

వైసీపీ ఓడిపోతుందనే జగన్‌ సభ రద్దు చేసుకున్నారట.. పరిటాల శ్రీరామ్‌ నయా లాజిక్‌

టీడీపీ నేత, గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరామ్‌.. ఆ పార్టీ యువ నేత నారా లోకేష్‌ను మరిపిస్తున్నారు. లాజిక్‌ లేకుండా ప్రసంగాలు చేస్తూ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. పోటీ చేసిన తొలి సారే ఓడిపోయిన శ్రీరామ్‌.. ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే.. ప్రచారం ఏ స్థాయిలో చేస్తారో బొత్తిగా అవగాహన లేనట్లుగా ఉంది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లతో కలసి ప్రచారంలో పాల్గొంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం ద్వారానే అందరి దృష్టిలో పడతామని భావించారో ఏమో గానీ.. పరిటాల శ్రీరామ్‌ వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఓ చిత్రమైన విమర్శ చేశారు.

తిరుపతిలో ఓడిపోతారని తెలిసే సీఎం వైఎస్‌ జగన్‌.. తన బహిరంగ సభను రద్దు చేసుకున్నారంటూ శ్రీరామ్‌ పేర్కొన్నారు. అదే సమయంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ల రోడ్‌ షోలకు ప్రజలను నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పుకొచ్చారు.

కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహిస్తే.. ప్రజా ఆరోగ్యానికి ప్రమాదమనే కారణంతో సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతిలో తన బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. వాస్తవంగా ఈ నెల 14వ తేదీన వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఉదృతి నేపథ్యంలో.. సభ రద్దు చేసుకుంటున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ సవివరంగా లేఖ ద్వారా తిరుపతి లోక్‌సభ ప్రజలకు తెలియజేశారు. బల్లి దుర్గా ప్రసాదరావు కన్నా ఎక్కువ మెజారిటీతో డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : తిరుపతి సభ రద్దు.. మనస్సులు గెలుచుకున్న సీఎం జగన్‌

వాస్తవ పరిస్థితిని వివరిస్తూ జగన్‌ సభను రద్దు చేసుకుంటే.. ఓడిపోతారని తెలిసే రద్దు చేసుకున్నారంటూ శ్రీరామ్‌ తర్కం లేని విమర్శ చేయడం విడ్డూరంగా ఉంది. అధికార పార్టీలో ఉన్న వారు ఉప ఎన్నికల్లో ఓడిపోతే అది ఆ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఒక వేళ పోటీ హోరాహోరీగా ఉన్నా సీఎం ప్రచారంలోకి దిగుతారు. అలాంటిది శ్రీరామ్‌ అన్నట్లు ఓడిపోతామని తెలిస్తే.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ప్రచారానికి రాకుండా ఉంటారా..? వైసీపీ ఓడిపోతే .. మరి అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది..? టీడీపీనే గెలిసే పరిస్థితి ఉంటే.. కోవిడ్‌ను కూడా లెక్క చేయకుండా ఏడు పదుల వయస్సులోనూ చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహిస్తూ.. కాలినడకన వీధుల్లో తిరగాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నకు సాధారణంగానే ఉద్భవిస్తుంది.

నిన్నటి వరకు సీఎం వైఎస్‌ జగన్‌ బహిరంగ సభను ఉద్దేశించి టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. ఈ రోజు శ్రీరామ్‌ మాటాలు పూర్తి భిన్నంగా ఉన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. తిరుపతిలో ఓడిపోతారనే సీఎం జగన్‌ ప్రచారానికి వస్తున్నారంటూ టీడీపీ నేతలు నిన్నటి వరకు వల్లె వేశారు. కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్‌ తన సభను రద్దు చేసుకుంటే.. ఓడిపోతారనే తెలిసి రావడం లేదంటున్నారు. ఇందులో ఏది నిజం..? టీడీపీ నేతలు వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. అంతిమంగా ప్రజా శ్రేయస్సుకే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఏదో విమర్శ చేయాలనే తొందరలో.. ఇలాంటి తర్కం లేని వ్యాఖ్యలు చేయడం ద్వారా శ్రీరామ్‌ లాంటి యువ నేతల అజ్ఞానం బయటపడుతోంది.

Also Read : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పరిటాల..!