iDreamPost
android-app
ios-app

TDP సెల్ఫ్ గోల్! Jr. NTR ఫ్యాన్స్ ఓట్లు అన్నీ YCPకి?

TDP సెల్ఫ్ గోల్! Jr. NTR ఫ్యాన్స్ ఓట్లు అన్నీ YCPకి?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విదితమే. కాగా, చంద్రబాబు బెయిల్ కోసం శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆయన తరుఫు లాయర్లు. మరో వైపు ఆయనపై ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం, అంగళ్లు ఘర్షణలతో పాటు పలు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఆయన అరెస్టుతో తెలుగు దేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. నారా లోకేశ్ పై నమ్మకం లేకపోవడం, బాలకృష్ణ తాత్కాలికంగా మాత్రమే పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నందున అందరి చూపు టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. పార్టీకి సరైన నాయకుడని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై జూ. ఎన్టీఆర్ మౌనం వహించడంపై మండిపడుతున్నారు.

చంద్రబాబు అరెస్టు జరిగితే.. టీడీపీ నేతలు, శ్రేణులు నానా యాగీ చేశారు. నారా కుటుంబం, హరికృష్ణ కుటుంబం మినహాయించి మిగిలిన నందమూరి కుటుంబం మద్దుతుగా మాట్లాడింది. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు సరికదా.. ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే మిగిలిన వారిని వదిలేసి జూనియర్ ఎన్టీఆర్ పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎన్టీఆర్ మౌనం వహించడంపై మండిపడుతున్నారు . అదే సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళుతూ కనిపించడంతో ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు . ఇలా చేయడం వల్ల టీడీపీకే నష్టం చేకూరుతుందన్న ఆలోచన చేయడం లేదు. అది సెల్ఫ్ గోల్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. చంద్రబాబు గతంలో వ్యక్తిగతంగా, పార్టీ విషయంలోనూ జూ ఎన్టీఆర్ పట్ల వ్యవహరించిన తీరు బహిరంగ రహస్యం. టీడీపీపై ఆధిపత్యం చెలాయించేందుకు, తన కొడుకు కోసం నందమూరి కుటుంబ వారసులను ఎవ్వరినీ పార్టీలోకి రానివ్వకుండా చేసిన ఘనత చంద్రబాబుకు చెల్లుతుందన్న విషయాన్ని ఎలా మర్చిపోగలరు.

చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పూర్తిగా వ్యక్తిగత విషయం. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తెలుగు తమ్ముళ్లు, నారా లోకేష్ అనుచరులు ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మండిపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆయన స్పందించేంత వరకు కాస్త టీడీపీ నేతలు మౌనం వహించి ఉండాల్సిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు.. ఇలా పంథాను అనుసరిస్తే.. పార్టీకి నష్టమే కాదూ.. ఉనికి కూడా ప్రశ్నార్థకం అవుతుంది. వచ్చే ఏడాది ఎలక్షన్స్ ఉన్న సమయంలో ఇటువంటి చర్యలు చేస్తే తమ గొయ్యి తాము తవ్వుకున్నట్లు అవుతుందని, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇది అధికార వైసీపీకి ఫేవర్ గా మారుతుంది. వైసీపీకి అనుకూల ఓట్లుగా మారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే జూ. ఎన్టీఆర్ ను తిడుతుంటే.. ఆయనకు అండగా నిలుస్తోంది ఫ్యాన్స్, వైసీపీ కార్యకర్తలే. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లన్నీ వైసీపీకి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.