iDreamPost
iDreamPost
శుక్రవారం అరెస్ట్‌లు ప్రభుత్వానికి ఆనవాయితీగా మారాయని మాజీ మంత్రి ఆలపాటి రాజా చేసిన కామెంట్ మరీ విడ్డూరంగా ఉంది. కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా ఉన్నప్పుడు బీకాం తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న అభియోగంతో ఎమ్మెల్సీ అశోక్ బాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి విదితమే. దీనిపై ఆలపాటి స్పందిస్తూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులను హింసించడమే పనిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఉందన్నారు. నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే కేసుకు అర్ధరాత్రి అరెస్ట్ చేశారన్నారు.
ఇదేం పద్ధతి?
నిందితుడిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు దానికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేస్తారు. అంతేతప్ప వారం, వర్జ్యం చూస్తారా? అర్థరాత్రి, పట్టపగలు తేడాలు పాటిస్తారా? వారి దృష్టికొచ్చిన అభియోగంపై ప్రాథమిక పరిశీలన, విచారణ పూర్తయ్యాకే అరెస్ట్ చేయడానికి వెళతారు. అందునా ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ప్రతిపక్షానికి చెందిన ఒక శాసనమండలి సభ్యుడు. నిందితుడు రాజకీయ నాయకుడు కూడా కనుక ఉత్తరోత్తరా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకటికి రెండు సార్లు తమ విచారణలో తేలిన అంశాలను ధ్రువీకరించుకున్నాకే అరెస్ట్ చేస్తారు. లేదంటే డిపార్ట్‌మెంట్ పరువు పోతుందన్న సంగతి సీఐడీకి తెలియదా? తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అనేటప్పటికి వెంటనే ఖండన ప్రకటనలు ఇవ్వడం, ప్రభుత్వంపై, పోలీసులపై అడ్డగోలుగా విరుచుకుపడడం ఆ పార్టీ నేతలకు ఒక అలవాటుగా మారిపోయింది. వివిధ కేసుల్లో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూలిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మొదలు కింది స్థాయి నాయకుడి వరకూ ఈ విధంగానే రచ్చ చేశారు. అయితే అన్ని సందర్భాల్లోనూ అరెస్ట్ చేసిన తీరును తప్పు పట్టడమే తప్ప తమ పార్టీ నాయకులు తప్పు చేయలేదని వీరు చెప్పకపోవడం గమనార్హం. అంటే వారు నేరం చేశారని వీరు అంగీకరిస్తున్నటే కదా! అటువంటప్పుడు ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పు పట్టడం ఎందుకు?
కోర్టుకు వెళ్లవచ్చు కదా…
కోర్టులు అంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి లెక్కలేదని, రాజ్యాంగానికి విరుద్ధంగా అశోక్ బాబును అరెస్ట్ చేశారని ఆలపాటి రాజా అనడం వింతగా ఉంది. మాజీ మంత్రి కూడా అయిన ఆలపాటి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం కాని, పోలీసులు కాని నడుచుకోకపోతే ఏం చేయాలో తెలియదా? అయినదానికి కానిదానికి కోర్టుల్లో కేసులు వేసే టీడీపీ నేతలు తమ పార్టీ ఎమ్మెల్సీని నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తే నాయ్యస్థానాన్ని ఆశ్రయించవచ్చు కదా? ప్రజా ప్రతినిధులను హింసించడమే పనిగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఉందని విమర్శలు చేస్తున్న ఆలపాటి అందుకు తన దగ్గర ఉన్న రుజువులతో కోర్టుకు వెళ్లి న్యాయం పొందవచ్చు. తద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టవచ్చు. ఇలాంటి అవకాశాలను వదిలేసుకొని పోలీసు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తోంది, పోలీసులు, అధికారులు వైఎస్సార్ సీపీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్నారని నోటికొచ్చినట్టు విమర్శలు చేస్తే మీడియాలో ప్రచారం వస్తుంది తప్ప అశోక్‌బాబు బయటకు రారు అన్న సంగతి గమనించాలని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు.
Also Read : అశోక్ బాబుని కొట్టారా?