Idream media
Idream media
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై చేసే విమర్శలు.. తనపై తానే చేసుకున్నట్లుగా ఉంటుందని అధికార పార్టీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. చంద్రబాబే కాదు.. టీడీపీ నేతలు కూడా వైసీపీ ప్రభుత్వం పై చేసే విమర్శలు.. చంద్రబాబు ప్రభుత్వ పాలనపై చేసినట్లుగా ఉంటున్నాయి. ఈ రోజు జగనన్న విద్యాదీవెన మూడో విడత సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వం జమ చేసింది. ఆ వెంటనే టీడీపీ శాసనసభ ఉప నేత, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. నాణ్యమైన విద్య లభించే రాష్ట్రాల జాబితాలో గతంలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 19వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భ్రష్టు పట్టించిందెవరు..?
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందెవరని అడిగితే.. ఏపీలో సామాన్యుడు కూడా చెబుతాడు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెప్పిన చంద్రబాబు.. ఆ బాధ్యత నుంచి వేగంగా తప్పుకున్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు మేలు జరిగేలా.. వ్యవహరించారు. గ్రామాలలో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలను విద్యకు దూరం చేసేలా.. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను మూసివేశారు. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను చంద్రబాబు ప్రభుత్వం మూసివేసింది. ఫలితంగా కొంత మంది తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలను సమీప పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సి వచ్చింది. ఫీజులు కట్టే శక్తిలేని పేదల పిల్లలు చదువులకు దూరమయ్యారు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైతే.. అక్టోబర్‌లో పుస్తకాలు వచ్చేవి. అప్పటికే సగం ఏడాది పూర్తయ్యేది. ఇలాంటి విధానాలను అవలంభించిన చంద్రబాబు ప్రభుత్వం.. పరోక్షంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేలా కుట్రలు చేసింది. ఇక ఫీజు రియంబర్స్‌మెంట్‌ను ఏళ్ల తరబడి బకాయిలు పెట్టి.. ఉన్నత విద్యపై సీత కన్ను వేశారు.
Also Read : BJP, Somu Veerraju – తెగనమ్మడం కన్నా తాకట్టు నేరమా..?
కనిపించడం లేదా నాడు – నేడు..
చంద్రబాబు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను జగన్ తిరిగి గాడిలో పెట్టారు. బాబు హాయంలో మూసి వేసిన ప్రభుత్వ పాఠశాలలను అన్నింటినీ తెరిపించారు. ఆ పాఠశాలల్లో నాడు-నేడు పేరుతో మౌలిక వసతులు కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లలో లేని వసతులు ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం, షూ, బెల్ట్, బ్యాగ్, టై అందిస్తున్నారు. నాణ్యమైన భోజనం మధ్యాహ్నం అందిస్తున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేలా పేద కుటుంబాలను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి పేరుతో ఏడాదికి 15 వేల రూపాయలు అందిస్తున్నారు. నగదు వద్దన్న 9, 10, ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు అందిస్తూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. అన్నింటి కన్నా..« ధనవంతులకే పరిమితమైన ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ చదవును ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందిస్తున్నారు. బాబు పెట్టిపోయిన ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు తీర్చి.. క్రమం తప్పకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థుల ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజుతోపాటు వసతి దీవెన పథకం పేరుతో హాస్టల్, మెస్ ఖర్చులకు 15 – 20 వేల రూపాయలు అందిస్తున్నారు.
కార్పొరేట్ స్కూళ్లు బాగుంటేనే విద్యావ్యవస్థ బాగున్నట్లా…?
నాణ్యమైన విద్యలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నిమ్మల రామానాయుడు దృష్టిలో కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల మాదిరిగా ఉంటేనే విద్యా వ్యవస్థ బాగున్నట్లుగా ఉంది. రకరకాల పేర్లతో బ్యాచ్‌లు ఏర్పాటు చేసి పిల్లలకు చదువు అనే ఆస్తిని ఇవ్వాలని కలలుకనే తల్లితండ్రుల ఆశలను సొమ్ము చేసుకునే కార్పొరేట్ సంస్థల ఆటలు ఇప్పుడు సాగకపోవడంతో విద్యా వ్యాపారంలో ఉన్న టీడీపీ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేనట్లుగా ఉంది. వారి ఆవేదననే నిమ్మల వినిపించినట్లుంది. విద్యా వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి అడిగితే తెలుస్తుంది.
Also Read : Nadendla Manohar, One Time Settlement – వన్ టైం సెటిల్మెంట్ అంటే దోచుకోవడమా మనోహర్..?