iDreamPost
android-app
ios-app

చిత్తశుద్ధిలేని నారీ సంకల్ప దీక్షలు ఎందుకు?

  • Published Feb 13, 2022 | 4:19 PM Updated Updated Feb 13, 2022 | 4:19 PM
చిత్తశుద్ధిలేని నారీ సంకల్ప దీక్షలు ఎందుకు?

రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ధోరణితో విమర్శలు చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. సందర్భం లేకపోయినా కల్పించుకొని మరీ తప్పుడు ఆరోపణలతో సీఎం జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారీ సంకల్ప దీక్షలు అటువంటివే. జనవరి 31న విజయవాడలో ఈ దీక్ష నిర్వహించిన ఆమె ఆదివారం రాజమహేంద్రవరంలో సాగించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పాలన అంతమొందించేందుకే నారీ సంకల్ప దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించేశారు.

ఇవి మహిళా రక్షణ చర్యలు కావా?

మహిళల రక్షణకు గతంలో ఏ ప్రభుత్వం తీసుకోనంత శ్రద్ధ ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు తీసుకొంది. దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు.. ఇలా మహిళల రక్షణలో మనరాష్ట్రం దేశంలోనే మిన్నగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో 1,01,19,642 మంది సెల్ ఫోన్లలో దిశ యాప్ ఉంది. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ ను అటూ ఇటూ కదిపితే చాలు నిమిషాల్లో పోలీసులు చేరుకొని రక్షణగా నిలుస్తారు. అధునాతన టెక్నాలజీ సాయంతో అలాంటి వ్యవస్థను రాష్ట్రంలో అమలులోకి తెచ్చారు.

అకృత్యాలు టీడీపీ హయాంలోనే..

మహిళలపై అకృత్యాలు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అన్న సంగతి అనిత మర్చిపోయారా? నాటి ఎమ్మెల్యే రోజాను నిష్కారణంగా అరెస్ట్ చేసి ఒక పూటంతా పోలీసు వాహనాల్లో అమరావతి చుట్టూ భయానక వాతావరణంలో తిప్పడం ఆమెకు తెలియదా? ఎమ్మార్వో వనజాక్షిని పట్టపగలు టీడీపీ నాయకులే జుట్టు పట్టి ఈడ్వడం గుర్తులేదా? పైగా ఈ వ్యవహారంలో ఆ మహిళా ఎమ్మార్వోదే తప్పు అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీ చేసి మరీ దోషులను వెనకేసుకొచ్చారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు సూత్రధారులు అన్న సంగతి గుర్తులేదా? అప్పుడు ఎందుకు నారీ దీక్షలు చేయలేదు? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మద్యాన్ని ఏరులై పారించారు కదా..

మద్యపాన నిషేదం అమలు చేస్తానని జగన్ మాట తప్పారని ఆరోపిస్తున్న అనిత టీడీపీ జమానాలో రాష్ట్రంలో ప్రతి వీధిలో ఆఖరికి గుడిపక్కన, బడిపక్కన కూడా బెల్ట్ షాపులు కనిపించేవన్న సంగతి మరిచిపోయారా? ఇవాళ అవి లేకుండా వైఎస్సార్ ప్రభుత్వం కట్టడి చేసింది. దశలవారీ మద్య నిషేధం అమలుకు కట్టుబడి షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. వాస్తవాలు ఇలా ఉంటే వీటికి పూర్తి భిన్నంగా స్పందించడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అనిత ప్రయత్నిస్తున్నారని అధికార పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. తమ పార్టీ నేతలు మహిళలపై అకృత్యాలు చేసినప్పుడు ప్రశ్నించలేని అనిత మహిళల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం మానేసి బురదజల్లడం తగదని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. జగన్‌ మోహన్ రెడ్డి పాలన అంతమొందిస్తామంటున్న అనిత తనకు అంత సీను లేదని తెలుసుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలతో, జనాదరణతో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీని ఓడించడం టీడీపీ తరం కాదు. ముందు పాయకరావుపేటలో ఆమె మళ్లీ ఓడిపోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read : ఏపీ రాజ‌ధానిపై క్లారిటీ ఇచ్చిన బొత్స‌