iDreamPost
android-app
ios-app

పోలవరం పై టీడీపీ ఎంపీ సలహాలు?

  • Published Feb 09, 2022 | 4:55 AM Updated Updated Feb 09, 2022 | 4:55 AM
పోలవరం పై టీడీపీ ఎంపీ సలహాలు?

తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి బీజేపీని కాని, కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వాన్ని కాని పల్లెత్తు మాట అనడం లేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మొదలు కిందిస్థాయి నాయకుడి వరకు ఈ కట్టడి పాటిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పఢ్ఢారని ఆయనపై ప్రత్యర్థులు కేసులు పెట్టారు. కోర్టుల్లో వ్యాజ్యాలు వేశారు. ఏ ఒక్క కేసును ఎదుర్కొనకుండా ఆయన ఎప్పటికప్పుడు స్టేలు తెచ్చుకున్నారు. కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తే ఆ కేసులను తిరగదోడతారన్న భయంతోనే టీడీపీ మాట వరుసకు కూడా ఆ పార్టీని ఏమీ అనడంలేదని రాజకీయ వర్గాల్లో వినిపించేమాట. అది నిజమే అన్నట్టు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించవలసిన సందర్భంలో కూడా టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు.

తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని అదే పని చేశారు. ఏపీ ప్రభుత్వం పోలవరంను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అసమర్థ పాలన నడుస్తోందని ఆరోపించారు. ఏపీ రోజురోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, ఆర్థిక క్రమశిక్షణ కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు.

ఆ నైతిక అర్హత టీడీపీకి ఉందా?

పోలవరం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతికఅర్హత లేదని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను కేంద్రం పూర్తి చేయకుండా అడ్డుపడింది చంద్రబాబు అన్న సంగతి కేశినేనికి తెలియదా? తన పార్టీ ఎంపీ రాయపాటికి ప్రాజెక్టు కాంట్రాక్ట్ అప్పగించేందుకు ప్రత్యేక హోదాను సైతం తాకట్టుపెట్టిన చరిత్ర చంద్రబాబుది. సోమవారం పోలవరం అంటూ వారం వారం అక్కడికి వెళ్లి ప్రాజెక్ట్ నిర్మాణం చురుగ్గా సాగిస్తున్నట్టు నాటి సీఎం చంద్రబాబు బిల్డప్ ఇచ్చారని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పోలవరం సందర్శన అంటూ టీడీపీ నేతలను, కార్యకర్తలను ఆర్టీసీ బస్సులలో అక్కడికి తీసుకువెళ్లి ప్రభుత్వ సొమ్ము దుబారా చేశారు. పోలవరం పూర్తి అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు పేరు వస్తుంది అన్న దురుద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం తెరపైకి తెచ్చారు.

ప్రధాని మోదీ చెప్పినట్టు పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చేసుకున్నారు. ఐదేళ్ళూ పబ్లిసిటీతో కాలక్షేపం చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఇన్ని చారిత్రక తప్పిదాలు చేసిన టీడీపీ ఇంకా పోలవరం గురించి ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది అంటే సిగ్గులేనితనం కాక మరేమిటని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక ఎంపీగా పోలవరం పూర్తికి సహకరించమని పార్లమెంట్లో అడగవలసిన కేశినేని అది మానేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? పెట్రోల్ ధరలు పెరిగినా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నా, రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించక పోయినా అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్టు విమర్శలు గుప్పించడం దిగజారుడు రాజకీయం కాదా? అని వైఎస్సార్ సీపీ నాయకులు అడుగుతున్నారు.

అప్పులపై దుష్ప్రచారం..

ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది, ఆర్థిక క్రమశిక్షణ కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్న కేశినేనికి టీడీపీ హయాంలోని అప్పుల భాగోతం, ఆర్థిక అరాచకం గురించి తెలియదా? దేశంలో ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రమే అప్పులు చేస్తున్నట్టు, పరిస్థితి దిగజారిపోయినట్టు టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన చంద్రబాబుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు అని వైఎస్సార్ సీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఎంపీగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయమని అడగడం చేతకాని కేశినేనికి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదని అంటున్నారు.

Also Read : 30 రోజులు అవకాశం ఇచ్చినా విమర్శలేనా ఉమా?