Idream media
Idream media
సంబంధం లేని విషయంపై కూడా స్పందిస్తూ ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం రాష్ట్రంలో అర్థవంతం లేని రాజకీయాలు చేస్తుందన్న అపవాదు మూటగట్టుకుంటోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటోంది కానీ, దాని వల్ల తన పరువే పోతుందని గుర్తుంచుకోలేక పోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాద్ దాస్ పదవీ కాలం పొడిగింపు అంశంలో అదే జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగించవద్దని టీడీపీ రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్ర నాద్ ఢిల్లీలో డీవోపీటి ఉన్నతాధికారులకు లేఖ రాయటం విచిత్రంగా ఉంది. పొడిగిస్తే ఆ పార్టీకి వచ్చే నష్టం ఏంటో అర్థం కాని విషయంగా మారింది.
చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యే సమయానికి సదరు ఐఏఎస్ అధికారిపై ఏవైనా కేసులున్నాయా ? అనే విషయాన్ని డీవోపీటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సదరు సీనియర్ ఐఏఎస్ ట్రాక్ రికార్డు చూసిన తర్వాతే చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు కేంద్రం అనుమతిస్తుంది. ముగ్గురు సభ్యుల జాబితాలోని ఎవరిపైనైనా కేసులున్నట్లు డీవోపీటీ అభ్యంతరాలు చెబితే కేంద్రం అదే విషయాన్ని ప్రస్తావించి వేరే జాబితాను పంపమంటుంది. ఆదిత్యనాద్ పై కేసుల విషయంలో కేంద్రం కన్వీన్సయిన తర్వాత మాత్రమే చీఫ్ సెక్రటరీ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా ఆదిత్య నాద్ పై ఉన్న ఆరోపణలేవీ కోర్టుల్లో నిర్ధారణ కాకపోగా సాక్ష్యాధారాలు లేవని కొట్టేసిందని వైసీపీ నేతలంటున్నారు. చీఫ్ సెక్రటరీగా నియామకం సమయంలో లేని అభ్యంతరం సర్వీసును మూడు నెలలు పొడిగించే విషయంలో ఎందుకుంటుంది ?
అయినా ఎవరిని ఎక్కడ నియమించుకోవాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమన్న చిన్న విషయం కూడా టీడీపీకి తెలియకపోవడం విచారకరమని పరిశీలకులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రిందట ఎంఎల్సీల జాబితాపైనా రాద్దాంతం చేసింది. ఇపుడు చీఫ్ సెక్రటరీ సర్వీసు పొడిగింపుపైనా గోల మొదలుపెట్టింది. ఆమధ్య స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నీలం సాహ్నీ నియామకంపైన కూడా రద్దాంతం చేసింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఇలాగే ఎవరైనా అభ్యంతరాలను వ్యక్తం చేస్తే నియామకాలను వెనక్కు తీసుకున్నారా ? ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఏవైనా డిమాండ్లు చేసినా ఉపయోగం ఉంటుంది కానీ పరిపాలనా సంబంధిత విషయాల్లో కూడా తాము చెప్పినట్లు జరగాలని కోరుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.