iDreamPost
android-app
ios-app

మనిషిపోయి పాతికేళ్లు అవుతున్నా.. కష్టకాలంలో ఆయన పేరే దిక్కవుతోంది..!

మనిషిపోయి పాతికేళ్లు అవుతున్నా.. కష్టకాలంలో ఆయన పేరే దిక్కవుతోంది..!

ఎన్టీ రామారావు సినీ నటుడుగా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుని, ఆ పై రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి.. తీవ్రమైన అవమాన భారంతో ప్రాణాలు కోల్పోయారు. తన కష్టార్జితమైన ముఖ్యమంత్రి కుర్చీని, తాను స్థాపించిన పార్టీని తన అల్లుడే లాక్కొవడం, అందుకు కొడుకులు, కూతుళ్లు మద్ధతు తెలపడంతో తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు దివికేగారు. ఎన్టీఆర్‌ మరణించి దాదాపు 25 ఏళ్లు అవుతోంది. అధికారంలో ఆయన పేరు ఎత్తేందుకు కూడా ఇష్టపడిన చంద్రబాబు నాయుడు.. అధికారం కోల్పోయిన సమయంలోనూ, కష్టకాలంలోనూ ఆయన పేరు పలకరిస్తారు. ఆయన ఫోటో తన వెనుక కనిపించేలా మీడియాకు ఫోజులిస్తారు.

2019 ఎన్నికల తర్వాత కూడా బాబు అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ఆయన జయంతి, వర్థంతి రోజున తాను, తన పార్టీ నేతల చేత డిమాండ్‌ చేయించడం, ఏడాదికి ఒకసారి నిర్వహించే మహానాడులో తీర్మానం చేయడం ఇప్పటి వరకు జరిగింది. అయితే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్‌ను టీడీపీ నేతలు ఆ రెండు సందర్భాలలోనే కాదు.. మధ్యలోనూ వినిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్‌ చేసి ప్రజల్లో చర్చకు తెరలేపారు.

జయంతికి, వర్థంతికి వినిపించే ఎన్టీఆర్‌కు భారత రత్న డిమాండ్‌.. ఈ సమయంలో ఎందుకు తెరపైకి వచ్చింది..? అనే ప్రశ్న మెదులుతోంది. రాజకీయంగా కష్టకాలంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ పేరును పలికే టీడీపీ నేతలు.. భారత రత్న డిమాండ్‌ను కూడా తరచూ వినిపించాలని నిర్ణయించినట్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మళ్లీ నిలదొక్కుకుంటామనే ఆశలు కూడా పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలతో అడుగంటిపోయాయి. చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదని టీడీపీ శ్రేణులు గుర్తించాయి. నాయకత్వ మార్పును కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందుకే కనకమేడల చేత రాజ్యసభలో ఎన్టీఆర్‌కు భారత రత్న డిమాండ్‌ను వినిపించారంటున్నారు.

1999లోనూ, 2014లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించే ప్రయత్నం చేయలేదు. అవకాశం ఉన్నా అప్పుడు ఈ పని చేయని బాబు.. తనకు అధికారం పోయిన సమయంలోనే భారత రత్న డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తుంటారు. ఎన్డీఏ కన్వీనర్‌గా ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేశానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోవడమే విడ్డూరం. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఎన్టీఆర్‌ పేరుతో రాజకీయాలు చేసే చంద్రబాబు తీరును ప్రజలే కాదు.. టీడీపీ శ్రేణులు కూడా గుర్తించాయి. అందుకే టీడీపీ పగ్గాలు జూనియర్‌ ఎన్టీఆర్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్నాయి. మరి బాబుకు మిగిలి ఉన్న మార్గం ఏమిటి..?

Also Read : చంద్రబాబుకు మరో “స్టే” – అమరావతి భూముల కుంభకోణం