iDreamPost
android-app
ios-app

ఆ తీర్మానం స‌రికాద‌ట‌.. అందుకే మాక్ అసెంబ్లీలో ఇలా..

ఆ తీర్మానం స‌రికాద‌ట‌.. అందుకే మాక్ అసెంబ్లీలో ఇలా..

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖ స్టీల్ ఎంప్లాయీస్‌ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ తీర్మానం ఉద్యమానికి కొండంత బలం ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని, విశాఖ ఉక్కు ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉందని రాజశేఖర్‌ అన్నారు.. జ‌గ‌న్ స‌ర్కార్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయ‌డంపై కార్మికుల స్పంద‌న అలా ఉంటే, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశానికి మాత్రం అది స‌రికాద‌ట‌. అందుకే ఆ పార్టీ నిర్వ‌హించిన మాక్ అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై చేసిన తీర్మానం చేశార‌ట‌.

ప్ర‌జా స‌మ‌స్య‌లు, బ‌డ్జెట్ పై జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌కు టీడీపీ హాజ‌రుకాలేదు. బ‌డ్జెట్ తో పాటు స్టీల్ ప్లాంట్ సంఘాల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది జ‌గ‌న్ స‌ర్కార్. ఆ స‌మావేశాల‌కు హాజ‌రుకాని టీడీపీ మాక్ అసెంబ్లీ న‌డుపుతోంది. రెండో రోజు జ‌రిగిన మాక్ అసెంబ్లీలో నారా లోకేశ్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేసి చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. అనంత‌రం టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన అంశం. దాన్ని కాపాడేందుకు రాష్ట్రం మొక్కుబ‌డి తీర్మానం చేసి కేంద్రానికి పంపిచ‌డం స‌రికాదు. ఉక్కు క‌ర్మాగారం ప‌రిర‌క్ష‌ణ ఐకాస పోరాటానికి సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇస్తూ స‌భ తీర్మానాన్ని ఆమోదిస్తోంది” అని తీర్మానం చ‌దివి వినిపించారు.

వారి మాక్ అసెంబ్లీ వారి ఇష్టం. తీర్మానాలు చేయ‌మ‌న‌డం కూడా త‌ప్పుకాదు. క‌నీసం ఈ సంద‌ర్భంగానైనా కేంద్రాన్ని ప‌ల్లెత్తు మాట అనని టీడీపీ పెద్ద‌లు రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని స‌రికాద‌న‌డ‌మే విచిత్రంగా ఉంది. ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికుల నిర‌స‌న‌లు 100 రోజులుగా కొనసాగుతున్నాయి. దీనిపై ఇప్పుడు టీడీపీ స్పందించింది. ఉక్కు క‌ర్మాగారం ప‌రిర‌క్ష‌ణ ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి పోరాటానికి సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇస్తూ టీడీపీ మాక్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించ‌డంపై సోష‌ల్ మీడియాలో కామెడీలు ట్రోల్ అవుతున్నాయి. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న అసెంబ్లీకి హాజ‌రుకాని టీడీపీ ఇలా మాక్ అసెంబ్లీ నిర్వ‌హించ‌డం, అందులో వింత వ్యాఖ్య‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.