Idream media
Idream media
కొంత మంది రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలకు, వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన ఉండదు. వారి వ్యాఖ్యలు, సవాళ్లలో తర్కం కూడా ఉండదు. అలాంటి వారిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మొదటి వరసలో ఉంటారు. ఆచరణ సాధ్యం కాని సవాళ్లు చేయడంతో చంద్రబాబు శిష్యుడునని బుద్ధా వెంకన్న తాజాగా నిరూపించారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడం పిరికిపంద చర్యని బుద్ధా వెంకన్న సీఎం వైఎస్ జగన్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారనే భయం జగన్‌లో పట్టుకుందట. అందుకే చిత్తూరు పర్యటనను అడ్డుకున్నారంటూ వెంకన్న చెప్పుకొచ్చారు. నిజంగా వైఎస్ జగన్‌కు ప్రజా బలం ఉంటే.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు వైసీపీ గెలిస్తే.. టీడీపీని మూసేస్తామని సవాల్ చేశారు. అదే టీడీపీ గెలిస్తే వైసీపీని మూసేయడానికి సిద్ధమా..? అని ప్రశ్నించారు.
వెంకన్న చేసిన సవాళ్ల మాదిరిగానే కొన్ని నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చేశారు. అమరావతిపై రెఫరెండ్ నిర్వహించాలని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని, వైసీపీ గెలిస్తే.. అమరావతిపై మాట్లాడబోమంటూ సవాళ్లు చేశారు. తాను చేసే సవాళ్లు ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబుకు తెలిసినా.. అమరావతి ఉద్యమానికి ఊపు తెప్పించేందుకు ఇలాంటి ప్రకటనలు చంద్రబాబు నుంచి వచ్చాయి. ఈ తరహా రాజకీయం చేయడంలో బాబుకు మరొకరు సాటి లేరు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ ఓట్లు వేస్తారు. మరి ఈ ఎన్నికల్లో అమరావతి అంశాన్ని ప్రచారం చేయొచ్చు. అమరావతిపై స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలనే రెఫరెండంగా తీసుకుందామని సవాల్ చేయొచ్చు. కానీ చంద్రబాబు నోటి నుంచి ఆ మాట రాలేదు. పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన టీడీపీ.. ఆ రెండింటిలో అమరావతి అంశాన్ని ప్రస్తావించలేదు.
బాబు మాదిరిగానే ఆయన శిష్యుడు కూడా అలాంటి సవాళ్లే చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై వెంకన్న సవాల్ చేయొచ్చు. లేదా కనీసం తన సొంత ఊరు, రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపోటములపైన అయినా సవాల్ చేయొచ్చు. కానీ వెంకన్న ఇవేమీ చేయకుండా.. తన గురువు మాదిరిగానే ఆచరణ సాధ్యం కాని సవాళ్లు చేస్తూ మీడియాలో ప్రచారం పొందేందుకు యత్నిస్తున్నారు. అయినా ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. టీడీపీని మూసేయడం బుద్ధా వెంకన్నకు సాధ్యమా..? అది అతని చేతిలో ఉందా..? టీడీపీలో తన స్థానం, స్థాయి ఏమిటనే అంశంపై పని లేకుండా, తర్కంలేని ఇలాంటి సవాళ్ల వల్ల టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ పార్టీ చంద్రబాబుది, ఆ తర్వాత నారా లోకేష్‌ది. ఇలాంటి సవాళ్లు చేసే అవకాశం, హక్కు చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేష్‌కు మాత్రమే ఉంటుంది. ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా లేకపోవచ్చు. చంద్రబాబు, చినబాబు లేదంటే బాలయ్యబాబులు ఇలాంటి సవాళ్లు చేస్తే వాటికి ఓ అర్థం, విలువ ఉంటుంది.