iDreamPost
android-app
ios-app

Ganja Gorantla – ఈ వేళ గోర్లంట వంతు..!

  • Published Oct 26, 2021 | 3:50 PM Updated Updated Oct 26, 2021 | 3:50 PM
Ganja Gorantla – ఈ వేళ గోర్లంట వంతు..!

మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారిపోయిందని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ మంగళవారం ఆ బాధ్యతను పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు  గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అప్పగించినట్టుంది. డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని ప్రచారం చేసే పనిని ఏరియాల వారీగా రోజుకొకరు చొప్పున పంచుకున్నారా అన్న అనుమానం వచ్చేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. పదే పదే ఒక అబద్ధాన్ని వల్లిస్తే నిజమని జనం నమ్ముతారనే గోబెల్‌ సూత్రాన్ని పాటిస్తున్న ఆ పార్టీ నాయకులు డ్రగ్స్‌, గంజాయి అంటూ కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడిన బుచ్చయ్య ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోక్‌శ్‌, ఇతర నేతలు ఇన్నాళ్లూ  చేసిన ఆరోపణలనే మళ్లీ చేశారు. కాకపోతే తన సీనియార్టీని ఉపయోగించి ఎక్కువగా ఆవేశ పడిపోయారు. గంజాయి సాగవుతోందని స్పష్టంగా తెలుస్తున్నా ఎందుకు నిలువరించలేకపోతున్నారని ఊగిపోయారు.

డీజీపీ సమీక్షించిన రోజే కావాలని..

రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలించే దిశగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు గౌతమ్‌ సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం మూడున్నర గంటల పాటు రాజమహేంద్రవరంలో సమావేశం నిర్వహించారు. దశాబ్థాలుగా పట్టిపీడిస్తోన్న గంజాయి సమస్యను సాగు దశ నుంచే కట్టడి చేసేందుకు సరిహద్దు రాష్ట్రాల సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రల సమన్వయంతో జాయింట్‌ యాక‌్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో 2లక్షల 90వేల కేజీల  గంజాయి స్వాధీనం చేసుకున్నామని, పదేళ్ల  కంటే  గత ఏడాదిలో  కొన్ని రెట్లు  అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు కూడా. గుజరాత్‌ ముంద్ర పోర్టులో దొరికిన డ్రగ్స్, నర్సాపూర్‌లో దొరికిన డ్రగ్స్‌తో రాష్ట్రానికి ఆపాదించడం కరెక్టు కాదని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ ఆరోపణలు చేయవద్దని అభ్యర్థించారు. అయినా బుచ్చయ్య చౌదరి రాజకీయ ఆరోపణలు మానలేదు. పార్టీలైన్‌ ప్రకారం మాట్లాడేసి, ప్రభుత్వంపై బురద జల్లేశారు.

ఎందుకొచ్చిన సీనియార్టీ..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గంజాయి సాగును అరికట్టాలని అధికారులు చిత్తశుద్దితో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంటే విమర్శలు చేయడం భావ్యమా? నగరంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంటే ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా తగిన సూచనలు, సలహాలు ఇచ్చివుంటే బావుండేది. అలాకాకుండా సగటు టీడీపీ నేతలాగే స్పందించారు. అసలు గంజాయి రవాణా ఇప్పుడే జరుగుతున్నట్టు, సీఎం జగన్‌ దగ్గరుండి సాగు చేయిస్తున్నట్టు రెచ్చిపోవడం ఎందుకో? తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్‌ మంత్రిపైనే మరో మంత్రి గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు చేస్తే పట్టించుకోని చరిత్ర తమరిది. అది మర్చిపోయి ఇలా రాజకీయ విమర్శలు చేస్తే జనం గమనించరనుకోవడం పొరబాటు. టీడీపీ నాయకులు రెండున్నరేళ్లుగా చేస్తున్న తప్పుడు ఆరోపణలను, కుట్ర రాజకీయాలను జనం నిశితంగా గమనిస్తున్నారు కనుకనే ఎప్పటి కప్పుడు ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెడుతున్నారు. అయినా గ్రహించలేకపోతే నేను టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్‌ను అని చెప్పుకోవడం ఎందుకు?

Also Read : Chandrababu Mud Slashing- మీ రాజకీయాలకోసం రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీస్తారా బాబూ?