iDreamPost
android-app
ios-app

విశాఖ, అమరావతి.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ

విశాఖ, అమరావతి.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ప్రత్యేక సమావేశాల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే అంశంపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఉదయం చర్చను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తన ప్రసంగంలో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ పలు వివరాలు వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నుంచి ఆ పార్టీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, వారి బంధువుల పేర్లుతో దాదాపు 4070 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు.

ఈ అంశంపై స్పీకర్‌ తమ్మినేని జోక్యం చేసుకుంటూ సభలో ఈ వివరాలు వెల్లడించారంటే అవన్నీ రికార్డు అయినట్లేనని, అసలు అమరావతిలో ఏమి జరిగిందో.? ఆర్థిక మంత్రి చెప్పిన విషయాలు నిజమా..? కాదా..? అనేది తెల్చి ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కోరారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు. స్పీకర్‌ విన్నపాన్ని అంగీకరించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై తప్పకుండా విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేలుస్తామని ప్రకటించారు.

ఇదే విషయంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు.. అమరావతితోపాటు, విశాఖలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కూడా విచారణ జరిపిచాలని డిమాండ్‌ చేశారు. జుడీషియల్‌ విచారణ జరిపించాలని, హైకోర్టు పర్యవేక్షణలో ఇది జరగాలంటూ కోరారు.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. అమరావతిపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలకు బదులుగా టీడీపీ విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ కౌంటర్‌ ఆరోపణలు చేస్తున్నదని తెలుస్తోంది.

అయితే ఈ ఆరోపణలను అధికార పార్టీ ఏ విధంగా తిప్పికొడుతుంది..? అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ ఎప్పటికి పూర్తవుతుంది.? ప్రజలకు నిజా నిజాలు చెబుతారా..? లేదా గత ప్రభుత్వ హాయంలో విశాఖలో జరిగిన లక్ష ఎకరాల భూ కుంభకోణం లాగా ఇది కూడా మరుగున పడుతుందా..? అన్నది కాలమే నిర్ణయించాలి.