iDreamPost
android-app
ios-app

కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలైతే.. మరి పుష్కర తొక్కిసలాట మరణాలు..?

కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలైతే.. మరి పుష్కర తొక్కిసలాట మరణాలు..?

శవ రాజకీయాలు అనే మాట అప్పడప్పుడు వింటుంటాం. ఆ రాజకీయాలు ఎలా ఉంటాయో సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయాలను చూస్తుంటే.. శవ రాజకీయాలు అంటే ఇలానే ఉంటాయనిపిస్తోంది. రెండేళ్లు గడుస్తున్న వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసేందుకు అవకాశం దొరకకపోవడంతో కరోనా వైరస్‌ మరణాలతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష టీడీపీ పార్టీ రాజకీయాలు చేస్తోంది.

జగన్‌ను హంతకుడుగా పరిగణించాలట..

కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో సాధన దీక్ష పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో, ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ మూడు గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను కూడా టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని, వైఎస్‌ జగన్‌ను నిందించేందుకు, విమర్శలు చేసేందుకు ఉపయోగించుకోవడం వారి రాజకీయ తీరుకు అద్ధం పడుతోంది. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు. అంతేకాదు.. సీఎం వైఎస్‌ జగన్‌ను హంతకుడుగా పరిగణించాలని కూడా బుచ్చయ్య తీర్మానించేశారు.

మీరే సాక్షి కదా బుచ్చయ్య..

కరోనా వైరస్‌ కేవలం ఏపీలోనే కాదు.. ప్రపంచం అంతా ఉంది. దాని వల్ల ప్రపంచం వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు వైద్యం అందించేందుకు, వారి ప్రాణాలు కాపాడేందుకు దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీ ప్రభుత్వం చేసింది. అయితే ఈ వైరస్‌ వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే మాత్రమే మరణాలు సంభవించినట్లు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైరస్‌ వల్ల జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలైతే.. మరి 2015లో గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అవి ఎవరు చేసిన హత్యలు..?

రాజమండ్రిలో వీఐపీలకు కేటాయించిన సరస్వతి ఘాట్‌కు పోకుండా.. సామాన్య ప్రజలకు కేటాయించిన పుష్కర ఘాట్‌లో చంద్రబాబు కుటుంబాన్ని స్నానాలు చేయమని చెప్పింది ఎవరు..? వారి స్నానం కోసం వేలాది మందిని గంటన్నరసేపు నిలిపి.. ఒక్కసారిగా వదిలేయడంతో తొక్కిసలాట జరగిందని అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదికలో తేల్చారు. ఆ ఘటన జరిగిన సమయంలో బుచ్చయ్య చౌదరి కూడా చంద్రబాబు పక్కన ఉన్నారు. మరి ఈ మరణాలకు ఎవరు బాధ్యులో బుచ్చయ్యే చెప్పాలి. ఏం.. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి చనిపోలేదా..? అంటూ ప్రజల ప్రాణాలకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వని చంద్రబాబు మాటలు బుచ్చయ్య మరచినా.. ప్రజలు మరచిపోలేదు.

Also Read : నేడు టీడీపీ దీక్ష‌.. విజ‌య‌వంత‌మ‌య్యేనా?