Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభం నుంచి దాదాపు 2 గంటల పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి – 2020 బిల్లుపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా బుగ్గన ప్రశంగించారు. బిల్లు ప్రవేశపెట్టడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు, అమరావతి రాజధానిలో జరిగిన భూ కుంభకోణంపై సవివరంగా మాట్లాడారు.
ప్రశంగం చివరలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడింగ్ ట్రేడింగ్‌పై మాట్లాడుతూ.. ఒకటో రెండో బినామీలు ఉంటాయని, వాటన్నింటిని పక్కన పెట్టి ఈ బిల్లుకు టీడీపీ సభ్యుల మద్దతు తెలపాలని కోరారు. ఈ సమయంలో బినామీలు అంటూ అందరితోపాటు.. సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేరు ప్రస్తావించి ముగించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తనపై ఆరోపణలు చేశారని, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని తన సీట్లో నుంచి లేచి గట్టిగా అడిగారు. అదే సమయంలో సీఆర్‌డీఏ రద్దు.. ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు బిల్లుపై చర్చను మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారని, ఆ తర్వాత ఇస్తానని స్పీకర్ తమ్మినేని సీతారం బుచ్చయ్య చౌదరికి సూచించారు. కానీ తనకు వెంటనే మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ బుచ్చయ్య చౌదరి పట్టుబట్టారు. తమ గొంతు నొక్కుతారా..? అంటూ ప్రశ్నించారు. పలుమార్లు స్పీకర్ సర్దిచెప్పి, తప్పకుండా మైక్ ఇస్తానని హామీ ఇవ్వడంతో తన సీట్లు కూర్చున్నారు.
కాగా, బుచ్చయ్య చౌదరి తీరు ఆసక్తిగొలుపుతోంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా దాదాపు 4070 ఎకరాలను టీడీపీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. ఇలా దాదాపు 30 మంది కొన్నారని మంత్రి బుగ్గన వారి పేర్లతో సహా సభలో వెల్లడించారు. వాటి విలువ ఎంత ఉంటుందో కూడా వివరించారు. అయినా ఎవరూ కూడా బుగ్గన ప్రశంగానికి అడ్డుతగలలేదు. ఆయన ప్రకటనను ఖండించలేదు. మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. పోడియం వద్దకు రాలేదు. నిరసన తెలపలేదు. కానీ బుచ్చయ్య చౌదరి ఒక్కడే తనపై మంత్రి బుగ్గన చేసిన ఆరోపణలపై స్పందించడం చర్చనీయంశమైంది.
బుచ్చయ్య చౌదరి తీరు ఒక సందేహాన్ని కలుగజేస్తోంది. మంత్రి పేర్కొన్న పేర్లు గల వ్యక్తులు కొంత మంది సభలో ఉన్నా కూడా వారెవరూ ఉలుకు పలుకూ లేకుండా ఉన్నారంటే వారిపై వచ్చిన ఆరోపణలు నిజమనే భావన కలుగుతోంది. ఒకవేళ వారు అక్రమంగా భూములు కొనుగోలు చేయకుంటే బుచ్చయ్య చౌదరిలాగే ఖండించేందుకు ముందుకు వచ్చేవారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.