iDreamPost
android-app
ios-app

కరోనా కేసుల సంఖ్య మీద కూడా విషం చిమ్ముతున్న దేవినేని ఉమా ..!

కరోనా కేసుల సంఖ్య మీద కూడా విషం చిమ్ముతున్న దేవినేని ఉమా ..!

సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవడం… కొందరు చేసే పని…! కానీ, రాష్ట్ర, దేశ… కాదు కాదు ప్రపంచ విపత్తుల్లోనూ రాజకీయాలను వెతుక్కోవడం ఒక్క తెలుగుదేశం పార్టీ..దాని అధినేత చంద్రబాబు, ఎల్లో మీడియాలకు మాత్రమే చేతనైన పని..! ప్రజలంతా కరోనా వల్ల భయబ్రాంతులకు గురై ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బతుకుతుంటే…జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు, వాటి లెక్కల్లో అవకతవకలకు పాల్పడుతూ..అమరావతిని నెరుగార్చేందుకు ప్రయత్నిస్తోందంటూ టీడీపీ దిగజారుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది.

ఇవీ లెక్కలు…!

ఈ రోజు ఉదయానికి వరకున్న లెక్కల ప్రకారం ఏపీలో మొత్తం 473 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు(109), కర్నూలు(91), విశాఖపట్నం(20) జిల్లాల కేంద్రంగా తెలుగుదేశం రాజకీయం చేస్తోంది. అమరావతి ఉన్న జిల్లా కాబట్టే ప్రభుత్వం గుంటూరులో ఎక్కువ కేసులు చూపించి…విశాఖపట్నంలో తక్కువ కేసులు చూపిస్తోందనే వితండవాదాన్ని ఎత్తుకుంది. ఈ నేపథ్యంలో టీడీపి వాదనలోని నైతిక, అనైతికాలను ఒకసారి పరిశీలిద్దాం…..

ఏదీ నైతికత…

టీడీపీ, ఎల్లో మీడియాలు తమ వాదన, విమర్శలకు కేసుల సంఖ్యను ఆధారం చేసుకుంటున్నాయి. సరే వారి వాదాన్నే ప్రామాణికంగా తీసుకుంటే గుంటూరుకు తరువాత ఎక్కువ కేసులు కర్నూలులో నమోదయ్యాయి…అవుతున్నాయి. జగన్‌ ప్రభుత్వం నిజంగానే అమరావతికి వ్యతిరేకంగా… మూడు రాజధానులకు అనుకూలంగా కరోనా కేసులను వాడుకోవాలనుకుంటే…కర్నూలు జిల్లా కేసుల్లో నుంచి ఓ నలభై తీసుకొచ్చి కృష్ణా జిల్లాలో(44 మాత్రమే) కలిపి ఉండేది కదా….! అమరావతికి వ్యతిరేకంగా కుట్ర చేయాలనుకుంటే సీఎం పదవిలో ఉన్న జగన్‌కు ఇదేమంత కష్టమైన పని కాకపోవచ్చు.! కానీ, ఆయన విపత్తుల్లో రాజకీయం వెతుక్కోవట్లేదు…! దీనికి నిదర్శనమే అమరావతిని ఆనుకొని ఉన్న కృష్ణా జిల్లాలో కంటే వైయస్సార్‌సీపీ బలంగా ఉండే కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవడం..!

సొంత ఎమ్మెల్యే అయినా…

గుంటూరులో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఆంధ్రజ్యోతి చెప్పకనే చెప్పింది. గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే..! అయితే వారిని క్వారంటైన్‌ నుంచి పంపాల్సిందిగా ముస్తఫా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు…అధికారులు దానికి ఒప్పుకోవట్లేదని ఆంధ్రజ్యోతి తన వెబ్‌సైట్‌లో వార్త ప్రచురించింది. పైగా ఇదే విషయమై మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముస్తఫాల మధ్య మాటల యుద్ధం సాగిందని పేర్కొంది. కానీ, నిబంధనల మేరకు 28 రోజుల వరకు క్వారంటైన్‌ నుంచి ఎవరినీ పంపమని మంత్రి స్పష్టం చేసినట్లు పేర్కొంది. కానీ, మరోవైపు దానికి పూర్తి విరుద్ధంగా గుంటూరు కరోనా కేసుల్లో కుట్ర అంటూ సన్నాయి నొక్కలు నొక్కుతుండటం గమనార్హం.

విశాఖపై ఇది తగునా….

విశాఖలో తక్కువ కేసులు వెనుక ప్రభుత్వ హస్తం…! ఇది మరింత హాస్యాస్పదం..! ఉత్తరాంధ్ర సామాజిక, భౌగోళిక స్వరూపాలపై అవగాహన ఉన్నవారెవరూ ఇలాంటి విమర్శలు చేసి నవ్వులపాలు కారు. విజయనగరం జిల్లా విశాఖ నగరానికి అనుకొని ఉంటుంది. విజయనగరం, ఎస్‌ కోట మొదలకొని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు రోజూ విశాఖ వస్తుంటారు. ఇప్పటి వరకు విశాఖలో 20 కేసులు నమోదయ్యాయి. కానీ, అనూహ్యంగా విజయనగరం, శ్రీకాకుళంలో ఒక్క కేసూ నమోదు కాలేదు. ప్రభుత్వం దాయాలనుకొంటే సంఖ్యను తగ్గించి చెప్తుంది కానీ, ఏకంగా వైరస్‌ వ్యాప్తే లేదని(విజయనగరం, శ్రీకాకుళం) చెప్పదు కదా…?వైరస్ దాస్తే దాగేదా?దాస్తే ఆంధ్రజ్యోతి,ఈనాడు వెలికితీసేవి కావా? నిజంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్‌కు రాజు(ప్రిన్స్‌ చార్లెస్‌), మంత్రి( బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌), బంట్రోతు అనే తేడా లేదు…!

పక్క రాష్ట్రాల్లోనూ..

ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌…ఇవన్నీ రాజధానులే ఆయా నగరాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనైతే ఏకంగా 200 కేసులకు పైగా నమోదయ్యాయి. దాన్ని కుట్రే అందామా…? నిన్న సాయంత్రం ముంబై బాంద్రా రైల్వే స్టేషన్ ముందు వేలల్లో వలస కూలీలు పోగయ్యారు…పుణెని రాజధాని చేసేందుకే ఉద్ధవ్ ఠాక్రే ఇలా చేయించాడు అందామా..?ఈ ప్రశ్నలన్నీ ఎంత హాస్యాస్పదమో… అమరావతి కేంద్రంగా టీడీపీ చేస్తున్న కరోనా రాజకీయం అంతే హాస్యాస్పదం…!

పక్క రాష్ట్రంలో ఇలా…

తెలంగాణనే తీసుకుంటే ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. కానీ ఏపీలో జన సంచారాన్ని పరిమితం చేసే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఉదయం 6 నుంచి 9 గంటల వరకే షాపులను పరిమితం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నిబంధన కొనసాగుతోంది. దీనికి విరుద్ధంగా గుంటూరు జిల్లాలో జనాలను రాత్రి వరకు రోడ్లపై తిరగ నిచ్చి వైరస్ వ్యాప్తి చెందేలా ప్రవర్తించి ఉంటే ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించవచ్చు. కానీ, ప్రభుత్వం అలా ప్రవర్తించిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వైరస్ వ్యాప్తిలో రాజకీయాన్ని వెతుక్కోవడం నిజంగా దురదృష్టకరం.