iDreamPost
android-app
ios-app

అడగాలంటే.. ముందు వినాలి కదా బాబు ..!

అడగాలంటే.. ముందు వినాలి కదా బాబు ..!

అందరూ ఊహించినట్లుగానే ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరించారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ తన ప్రసంగాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. గవర్నర్‌ తన ప్రసంగం ప్రారంభించగానే టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో నిరసనలకు దిగారు. నల్లచొక్కాలు ధరించి సభలకు హాజరైన టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి అక్రమ అరెస్ట్‌లు ఆపాలని.. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రసంగం అబద్ధాల పుట్ట అంటూ ఆసాంతం నినాదాలు చేశారు.

గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత ఉభయ సభల్లో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ సమయంలో చర్చిస్తారు. అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఈ సమయంలో ఎవరి వాదన వారు వినిపించుకోవచ్చు. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గవర్నర్‌ ప్రసంగం అబద్ధాల పుట్ట అని చర్చలో తమ వాదనను వినిపించవచ్చు. ఆ సయమంలో తమ వద్ద ఏమైనా ఆధారాలు, గణాంకాలు ఉంటే వాటిని వెల్లడించి ప్రభుత్వ తీరును ఎండగట్టవచ్చు. అలా కాకుండా గవర్నర్‌ ప్రసంగం సాగుతున్నంత సేపు నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ప్రసంగం వినకుండానే అబద్ధాల పుట్ట అని ఎలా అంటారన్న ప్రశ్న సామాన్యులకు కూడా కలుగుతోంది.

ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్‌ చదువుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అందులో ఏ ముందో తెలిస్తే విని, నోట్‌ చేసుకుంటేనే కదా.. అందులోని అబద్ధాలు, లోపాలపై అధికార పార్టీని ప్రశ్నించవచ్చు. చేయకుండానే చేశారని నిలదీసి ప్రజల మన్ననలు పొందవచ్చు. అసలు వినకుండా ఉంటే అధికార పార్టీని ఏమి ప్రశ్నిస్తారు.? టీడీపీ వైఖరి చూస్తుంటే.. సభలో గందరగోళం సృష్టించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. గవర్నర్‌ ప్రసంగంతోనే మొదలు పెట్టారంటే తదుపరి సమావేశాల్లోనూ ఇది కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సభను అడ్డుకుంటూ సస్పెండ్‌ అవ్వాలన్నదే వారి లక్ష్యంగా కనపడుతున్నట్లు ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

టీడీపీ సభ్యులు అక్రమ అరెస్ట్‌లు అని అంటే.. కాదు అవినీతిపై అరెస్ట్‌లు అని అధికార పార్టీ సాక్ష్యాధారాలతో మాట్లాడుతుంది. అచ్చెం నాయుడు అరెస్ట్‌కు కారణమైన ఈఎస్‌ఐ కుంభకోణం, జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌కు దారితీసిన బీఎస్‌ 3 వాహనాలు బీఎస్‌ 4గా మార్చే వ్యవహారం వరకే అధికార పార్టీ ఆగే అవకాశం లేదు. రాజధాని అమరావతి భూ కుంభకోణం, విశాఖ భూ కుంభకోణం, అగ్రిగోల్ట్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్, చంద్రన్న కానుకలు, సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు.. ఇలా టీడీపీ హాయంలో జరిగాయని భావిస్తున్న ప్రతి అక్రమ, అవినీతి వ్యవహారాలపై అధికార వైసీపీ సభ్యులు మాట్లాడే అవకాశం ఉంది. వీటన్నిటికి సమాధానం చెప్పే పరిస్థితిలో టీడీపీ లేదనే చెప్పాలి. అలా కాకుండా సస్పెండ్‌కు గురైతే ఈ అంశాలు చర్చకు రాకుండా చూడొచ్చు.. పైగా సస్పెండ్‌కు గరయ్యామనే సానుభూతి తమ అనుకూల మీడియా ద్వారా పొందవచ్చనే ప్లాన్‌ టీడీపీ అమలు చేస్తున్నట్లుగా తాజా పరిణామాలు ద్వారా తెలుస్తోంది.