iDreamPost
android-app
ios-app

ఒక పట్టణం, ఓ గ్రామం.. ఆ నియోజకవర్గంలో టీడీపీని తల్లకిందులు చేస్తున్నాయి

ఒక పట్టణం, ఓ గ్రామం.. ఆ నియోజకవర్గంలో టీడీపీని తల్లకిందులు చేస్తున్నాయి

గెలుపు ఓటములు ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి స్థానిక పరిస్థితులు, అభ్యర్థి. బలమైన వర్గం, ఓటు బ్యాంకు ఉన్నా.. ఈ రెండు అంశాలలో బలహీనంగా ఉంటే.. ఆ పార్టీ ఓడిపోవడం ఖాయంగా జరుగుతుంది. ఈ విషయాన్ని నిరూపిస్తోంది ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం. కందుకూరు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గ జనాభా అధికం. టీడీపీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. అయినా టీడీపీ ఇక్కడ రెండు దశాబ్ధాలుగా ఓడిపోతూనే ఉంది. నాలుగు పర్యాయాలుగా గెలుపు టీడీపీ తలుపు తట్టడం లేదంటే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. ఇది వాస్తవం.

కందుకూరు నియోజకవర్గంలో టీడీపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? అనే ప్రశ్న వేసుకుంటే.. రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి కందుకూరు (మున్సిపాలిటీ) పట్టణంలో శాంతి భద్రతలు, రెండు మాచవరం గ్రామం. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి స్వగ్రామమైన కందుకూరు మండలం మాచవరం గ్రామం మినహా.. కందుకూరు, గుడ్లూరు, వలేటివారి పాలెం, ఉలవపాడు, లింగసముద్రం మండలాల్లో గతంలో టీడీపీ, కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ, వైసీపీలు నువ్వా నేనా..? అన్నట్లుగా ఉంటాయి. మెజారిటీ గ్రామాల్లో టీడీపీదే పైచేయి. అయితే ఆయా గ్రామాలలో వచ్చే మెజారిటీని మాచవరం గ్రామం, కందుకూరు పట్టణం తగ్గిస్తూ.. టీడీపీ ప్రత్యర్థి పార్టీలకు విజయం చేకూరుస్తున్నాయి.

మాచవరం గ్రామంలో దాదాపు ఐదు వేల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ నామమాత్రం. ఆ పార్టీకి రెండు వందల ఓట్లు రావడం కూడా గగనమే. ఇక కందుకూరు పట్టణంలో శాంతి భద్రతలకు స్థానిక ఓటర్లు పెద్దపీట వేస్తున్నారు. దాదాపు మూడు దశాబ్ధాల నుంచి ఇక్కడ దీవి శివరాం టీడీపీకి నాయకత్వం వహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. పట్టణంలో రౌడీయిజం సాగుతుందనే ఆందోళన పట్టణవాసుల్లో నెలకొనడంతో.. 2004 నుంచి 2019 వరకు నాలుగు ఎన్నికల్లోనూ.. పట్టణంలో గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలకు మెజారిటీ వచ్చింది.

Also Read : కుప్పంలో బాబుకు జ్ఞానోదయం !

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినా.. కందుకూరులో మాత్రం టీడీపీ అభ్యర్థి దివి శివరాం ఓడిపోయారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. దివి శివరాం తన అనుచరులతో కలసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు.. వైసీపీ కార్యాలయంపై దాడులు చేశారు. ఆ పార్టీ ఫ్లెక్సీలను చించి దహనం చేశారు. అంతకు ముందు 2009 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు పట్టణంలో వీరంగం సృష్టించారు.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మానుగుంట మహీధర్‌ రెడ్డి చేతిలో మరోసారి టీడీపీ అభ్యర్థి దివి శివరాం 4,243 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కందుకూరు పట్టణంలో కాంగ్రెస్‌కు దాదాపు 2 వేల మెజారిటీ వచ్చింది. పట్టణంలోని వైశ్యులు టీడీపీకి ఓటు వేయకపోవడం వల్లనే దివి శివరాం ఓడిపోయారంటూ.. ఆ పార్టీ కార్యకర్తలు పట్టణం నడిబొడ్డున పోస్టాఫీసు సెంటర్‌లో ఉన్న గుప్తాస్‌ నగల షోరూం అద్దాలను ధ్వంసం చేశారు.

తన తండ్రి మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ దివి కొండయ్య చౌదరి రాజకీయ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన దివి శివరాం 1994లో తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మానుగుంట ఆదినారాయణ రెడ్డి రాజకీయ వారసుడిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన మానుగుంట మహీధర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999లో మహీధర్‌ రెడ్డిని ఓడించిన దివి శివరాం.. ఆ తర్వాత 2004, 2009, 2014ల్లో వరుసగా మూడు సార్లు ఓటమిని చవిచూశారు. 2014లో మహీధర్‌ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరకుండా మౌనంగా ఉన్నారు. 2014లో వైసీపీ తరపున డీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ, కొండపి నియోజకవర్గానికి చెందిన పోతుల రామారావు పోటీ చేశారు. ప్రత్యర్థి మారినా.. దివి శివరాం తలరాత మారలేదు. మళ్లీ ఓడిపోయారు.

Also Read : అనంత టీడీపీలో ఆ ఇద్దరినీ పక్కన పెట్టేశారా? 

ఈ పరిస్థితిని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అభ్యర్థి మార్పుపై దృష్టి పెట్టారు. వైసీపీ తరపున గెలిచిన పోతుల రామారావును.. 2017లో టీడీపీలోకి చేర్చుకున్నారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోతుల బరిలో నిలిచారు. మానుగుంట మహీధర్‌ రెడ్డిని ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ.. కందుకూరు బరిలో దింపింది. కందుకూరు చరిత్రలో మునుపెన్నడూలేనంతగా 14,936 ఓట్ల భారీ మెజారిటీతో మహీధర్‌ రెడ్డి గెలిచారు.

ఎన్నికల తర్వాత పోతుల రామారావు నియోజకవర్గం వైపు చూడడంలేదు. మళ్లీ దివి శివరాం టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు. ఇటీవల కందుకూరులో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పోతుల రామారావు కనిపించలేదు. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరో కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ దివి శివరాంకే టీడీపీ టిక్కెట్‌ ఇస్తుందా..? లేకపోతే కొత్త వారికి అవకాశం దక్కుతుందా..? 2024 ఎన్నికల్లోనైనా టీడీపీకి అవకాశం లభిస్తుందా..? అనేవి ఇప్పట్లో సమాధానం లభించని ప్రశ్నలు.

Also Read : అధికార పార్టీ సర్వే.. ఎమ్మెల్యేల జాతకాలు తేలుతున్నాయ్‌