iDreamPost
android-app
ios-app

గొల్ల‌పూడిలో ఘొల్లుమంటున్న టీడీపీ

గొల్ల‌పూడిలో ఘొల్లుమంటున్న టీడీపీ

మైలవరం నియోజకవర్గానికి గుండెకాయ వంటిది గొల్లపూడి. ద‌శాబ్దాలుగా ఈ ప్రాంతం తెలుగుదేశానికి పెట్ట‌ని కోట‌. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కు ఈ గ్రామం అండ‌గా ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇక్క‌డి ప్రజలు వైసీపీకే జై కొడుతున్నారు. దీంతో నేత‌లు కూడా వైసీపీకి జై కొట్టాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఇప్పటికే పంచాయతీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో తీవ్ర పరాభవం ఎదుర్కొన్న ఉమాకు తాజా పరిణామాలతో దిమ్మతిరుగుతోంది. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గొల్లపూడిలో ద‌శాబ్దాల టీడీపీ కోట బీటలు వారుతోంది. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.

గొల్లపూడిలో అధికార పక్షంలో చేరేందుకు టీడీపీ నేత‌లు క్యూ కడుతున్నారు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. ఇక్క‌డ‌ గొల్లపూడి అతి పెద్ద గ్రామం. ఒక్క గ్రామంలోనే 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉండేది ఇక్కడే. గ‌తంలో నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్పుడు టీడీపీ తరఫున అన్ని ఎంపీటీసీ స్థానాలకూ అభ్య‌ర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. అప్ప‌ట్లో ఎన్నిక‌లు నిలిచిపోయాయి. పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముగియ‌డంతో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పైనే ప‌డింది. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల తేదీలు ఖ‌రారు కావ‌డం లేదు. ఇదిలా ఉండ‌గా, టీడీపీ త‌ర‌ఫున గొల్ల‌పూడి మండ‌లంలో నామినేష‌న్ వేసిన 10 ప‌ది మందిలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ముందు నలుగురు అభ్యర్థులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. గొల్లపూడి 1, 3, 5, 8 సెగ్మెంట్‌ అభ్యర్థులు చెరుకుమల్లి నరేంద్ర, దాఖర్ల కిషోర్‌బాబు, యడవల్లి శారమ్మ, పిళ్లా శివ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సమక్షంలో వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ప్ర‌భావం మున్సిప‌ల్ ఎన్నిక‌ల పై ప‌డింది. వైసీపీ తిరుగులేని హ‌వా చాటింది.

వారి రాజీనామాలతో అప్ర‌మ‌త్త‌మైన దేవినేని ఉమా నియోజ‌క‌వ‌ర్గంలోని తెలుగుదేశం నేత‌లు, కేడ‌ర్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతూనే ఉన్నారు. త్వ‌ర‌లో జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌లు ఉండే అవ‌కాశం ఉండ‌డంతో మిగ‌తా వారినైనా కాపాడుకోవ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నిరంత‌రం వారితో మాట్లాడుతూ కాపాడుకునేందుకు శ్ర‌మించారు. అయిన‌ప్ప‌టికీ స్థానికంగా ప్ర‌జ‌ల్లో తిరుగులేని ఆదర‌ణ పొందుతున్న వైసీపీ వైపే నేత‌లంద‌రూ చూస్తున్నారు. మ‌రో ఇద్ద‌రు వైసీపీ గూటికి చేరారు. దీంతో ఉమా శ్ర‌మ వృథా అయింది. ఇప్పుడు తాజాగా సీఎం పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమక్షంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రామ్మోహనరావు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. టీడీపీ కార్యకర్తలు, మండలస్థాయి నేతలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగామ సురేష్‌లు పార్డీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీలోకి ఆరుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థి చేరారు. తాజాగా ఉమా అనుచరుడు, టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కోమటి రామ్మోహనరావు వైఎస్ఆర్‌సీపీలోకి చేరారు. దీంతో మొత్తం 10 మంది టీడీపీ ఎంపీటీసీ అభ్య‌ర్థుల్లో ఇప్ప‌టికే 7గురు వైఎస్సార్‌సీపీలోకి చేరిపోయారు. ఎన్నికలు మొద‌లైతే గొల్ల‌పూడి వైసీపీ ఖాతాలో చేరిపోయిన‌ట్లే. ఇలా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వరుస చేరికలతో గొల్లపూడిలో టీడీపీ జవసత్వాలు కోల్పోతోంది. ఉమాకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది