Idream media
Idream media
రాజకీయాల్లో నేతలు, పార్టీల మధ్య సద్విమర్శలు ఎంతో ముఖ్యం. సద్విమర్శలే ప్రజా స్వామ్యానికి ప్రాణం అంటారు. ప్రభుత్వం విధానాలు, నిర్ణయాలపై సద్విమర్శలు చేస్తూ ప్రజలకు మేలు చేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీపై ఎంతో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీదే. ఈ బాధ్యతను ప్రతిపక్ష పార్టీ సమర్థవంతంగా నిర్వహిస్తే.. ఆ పార్టీకి అధికారం అప్పజెబుతారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో నిరూపితమైంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధనాలు, నిర్ణయాలు, అవినీతిపై అలుపెరగని పోరాటం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ టీడీపీ నేతలను, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేయలేదు. పక్కా ఆధారాలు, గణాంకాలతో ప్రభుత్వంపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేశారు. ప్రజలు వైఎస్ జగన్ మాటను విశ్వసించారు. అధికారం అప్పగించారు.
40 ఏళ్లకు పైబడి రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు ఈ విషయం ఇంకా అర్థం కానట్లుగా ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న చంద్రబాబు.. ఆ దిశగా చేసే ప్రయత్నాలు మాత్రం సరైన దిశలో సాగడంలేదనే మాట బలంగా వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో చంద్రబాబు అండ్ కో సఫలం కాలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల వల్ల ప్రజలకు నష్టం కలిగేలా ఉంటే.. వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన పనిని టీడీపీ నేతలు పూర్తిస్థాయిలో చేయడంలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు, విమర్శలకే సరిపెడుతున్నారని చెబుతున్నారు. ఎక్కడ ఏది జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ఆరోపణలు, విమర్శలు చేయడం వల్ల టీడీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఉదహారణకు.. ఇటీవల కడప లో ఎర్రచందనం స్మగ్లర్లు హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనను టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ వైసీపీ నేతలకు, వైసీపీ ప్రభుత్వానికి ఆపాదించి విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం స్మగ్లర్లను విడుదల చేసి విలువైన ప్రకృతి సంపదను రాష్ట్రం దాటిస్తోందన్నారు. వైసీపీ నేతలు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఎర్ర చందనం స్మగ్లర్ బాషా భాయ్‌ను అరెస్ట్ చేశారు. మొత్తం వ్యవహారం బాషా భాయ్ నడిపాడని పోలీసులు తేల్చారు. విచారణను అతను ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మంది ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకునే పనిలో పోలీసులు తలమునకలయ్యారు.
ఘటన జరిగినప్పుడు దాన్ని వైసీపీ నేతలకు ముడిపెట్టి విమర్శలు చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్.. పోలీసులు ప్రధాన నిందితుడును అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం నోరు మెదపడంలేదు. అసలు ఈ వ్యవహారం ఏమీ తెలియనట్లుగా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఇక్కడే ప్రజలు టీడీపీ రాజకీయాలను గమనిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల.. వాస్తవికమైన విమర్శలు టీడీపీ నేతలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోతోందనే మాట వినిపిస్తోంది. మోకాలుకి బోడి గుండుకు ముడివేసే రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం టీడీపీ నేతలు గుర్తించడం వల్ల వారికి, ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే ఇదే స్థానంలో ప్రజలు కూర్చేబెట్టే పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగుతాయనడంలో సందేహం లేదు.