iDreamPost
iDreamPost
టీడీపీ హయాంలో పరిపాలన పండగలా ఉండేదని ఆ పార్టీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. టీడీపీ పాలన కేవలం ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకే పండగలా ఉండేదని ఎద్దేవా చేస్తున్నారు. ఆలపాటి మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పాలనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాక, టీడీపీ పాలన అద్భుతంగా సాగిందని చెప్పుకున్నారు. మూడేళ్లుగా సీఎం జగన్ వ్యవసాయంపై సమీక్షలు జరపలేదని అడ్డగోలుగా విమర్శించారు. వ్యవసాయం బాగుందని ప్రచారాలు చేసుకుంటున్నారని, రైతు భరోసా కేంద్రాలు ఏమయ్యాయో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేని గ్రామం లేదని ఆరోపించారు.
అడుగడుగునా దోపిడీయే కదా?
తెలుగుదేశం పాలనలో సమాజంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేసి, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల అభ్యున్నతికి పాటు పడడం వల్లనే గత ఎన్నికల్లో టీడీపీని జనం చిత్తుగా ఓడించారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అంగన్వాడీ కేంద్రం నుంచి అమరావతి వరకు అంతటా దోపిడీ రాజ్యం చేసిందని చెబుతున్నారు. నాయకులకు కాంట్రాక్టులు, జన్మభూమి కమిటీలకు పల్లెలపై పెత్తనం అప్పగించి దోపిడీకి చంద్రబాబు తలుపులు బార్లా తెరిచారని చెబుతున్నారు. అందుకే ప్రభుత్వ పథకాల లబ్ధి సామాన్యులకు కాక పచ్చ చొక్కాల వారికి చేకూరింది. నెలనెలా సామాజిక పింఛనులు అందుకొనే వారి వద్ద కూడా కమీషన్లను దండుకున్న ఘనత టీడీపీ వారిది. కేవలం ఇసుక, మట్టి అక్రమ అమ్మకాల ద్వారా ఆ పార్టీ నేతలు కొందరు
రూ. కోట్లకు పడగలెత్తారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయినా బాబు పాలన స్వర్ణయుగం అని చెప్పుకోవడం వారికే చెల్లిందని అంటున్నారు.
మీ కంటికి కనిపించడం లేదా..
మూడేళ్లుగా సీఎం జగన్ వ్యవసాయంపై సమీక్షలు జరపలేదని ఆరోపిస్తున్న ఆలపాటి అసలు రాష్ట్రంలోనే ఉన్నారా? అన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క వ్యవసాయ రంగంపైనే కాకుండా అన్ని శాఖలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంగతి అందరికీ తెలుసునని, కావాలనే టీడీపీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. ఇటీవల చంద్రబాబు అసలు రాష్ట్రంలో వ్యవసాయశాఖ ఉందా? అని ప్రశ్నించి తన అక్కసు బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ఆలపాటి వంతు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఎరువుల కొరత అంటున్న ఆలపాటి గ్రామాల్లోకి వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని సూచిస్తున్నారు.
సంక్షేమ పథకాలు అమలును చూడలేకనే..
రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సొమ్మును వారి ఖాతాల్లో వేసినప్పుడల్లా టీడీపీ నేతలకు వణుకు పుడుతోంది. ఏ వర్గం వారికి సొమ్ము జమ చేసినా వెంటనే మీడియా ముందుకు ఆ వర్గానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రకటనలు ఇచ్చేస్తుంటారు. ఈరోజు రాష్ట్రంలో 5,97,311 మంది రైతులకు రూ. 542.06 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని, రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు కలిపి మొత్తం రూ.571.57 కోట్లు ముఖ్యమంత్రి వారి ఖాతాలకు నేరుగా జమ చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఈర్ష్యతో ఆలపాటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తారని స్పష్టం చేస్తున్నారు.
Also Read : మాజీ, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుల మధ్య వార్..?