అచ్చెం నాయుడును అరెస్ట్‌ చేయబోయారా..? హత్య చేయబోయారా..?

ఈఎస్‌ఐ స్కాం ఏసీబీ అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన స్వగ్రామంలో ఏసీబీ అరెస్ట్‌ చేసినా.. మొలలకు ఆపరేషన్‌ జరగడంతో కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించినా.. ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అచ్చెం నాయుడు కోలుకున్నారు. ఏసీబీ విజ్ఞప్తి మేరకు ఆయన్ను మూడు రోజులు కస్టడీకి ఇస్తూ ఏబీసీ కోర్టు అనుమతిచ్చింది. ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి గుంటూరు జీజీహెచ్‌లో హైడ్రామా నడిచింది. పోలీసులు జైలుకు తరలిస్తున్నారంటూ టీడీపీ నేతలు, అనుకూల మీడియా నానా హంగామా చేసింది.

ఆస్పత్రిలోనే ఏసీబీ అధికారులు అచ్చెం నాయుడును విచారించాలని చెప్పినా.. పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించాలని చూస్తున్నారంటూ మాజీ హోం, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఈ రోజు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పటికే అరెస్ట్‌ అయి రిమాండ్‌లో ఉన్న అచ్చెం నాయుడును మళ్లీ పోలీసులు ఎలా అరెస్ట్‌ చేస్తారో హోం మంత్రిగా పని చేసిన నిమ్మకాయల చినరాజప్పకే తెలియాలి. చికిత్స ముగిస్తే.. జైలుకు లేదా ఏసీబీ కోర్టు అనుమతి ఇస్తే ఏసీబీ కస్టడీకి వెళతారు. అంతేకానీ మళ్లీ అరెస్ట్‌ చేయడం, ఎఫ్‌ఐఆర్‌ వేయడం అంటూ ఉందని చినరాజప్ప తెలుసుకోవాలి.

చినరాజప్ప ఇలా అంటుంటే.. మాజీ మంత్రి అయిన దేవినేని ఉమా మహేశ్వరరావు మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. అర్థరాత్రి అచ్చెం నాయుడును ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి హత్య చేయాలని పథకం పన్నారంటూ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి డైరెక్షన్‌లో బడుగు బలహీన వర్గాల్లో పార్టీ నాయకుడిగా, టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్న అచ్చెం నాయుడును కస్టడీలోనే చంపాలని ప్లాన్‌ చేశారంటూ ఆరోపించారు.

ఒకే పార్టీ నాయకులుగా చినరాజప్ప, దేవినేని ఉమాలు.. అచ్చెం నాయుడును అరెస్ట్‌ను జీర్ణించుకోలేకపోవడం సహజమే. అచ్చెం నాయుడును ఎందుకు అరెస్ట్‌ చేశారనే విషయం ప్రస్తావించకుండా ఆయన్ను వెనుకేసుకురావడం కూడా వారికి తప్పుకాదు. కానీ బీసీ నాయకుడు, బలహీన వర్గాల నేత అంటూ ఆయన చేసిన తప్పులను కులానికి అంటించడం తగని పని. అంతేకాకుండా.. ఆయన్ను హత్య చేయాలని ప్లాన్‌ చేశారంటూ దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన అచ్చెం నాయుడు వల్ల వైసీపీ ప్రభుత్వానికి గానీ, సజ్జల రామకృష్ణారెడ్డికి గానీ, లేదా మరో వైసీపీ నేతకు గానీ వచ్చే ముప్పు ఏమి ఉంటుంది..? ఇంకా ఆయన చేసిన అవినీతి వల్ల టీడీపీకి, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్కారును నడిపిన వారికి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందన్న విషయం సాధారణ వ్యక్తి కూడా అర్థం అవుతుంది. ఇది మరచి టీడీసీ నేతలు హాస్యాస్పదమైన విమర్శలు చేయడం వల్ల సెల్ఫ్‌ గోల్స్‌ పడే ప్రమాదముంది.

Show comments