iDreamPost
android-app
ios-app

జీర్ణించుకోవడం కష్టమవుతోంది..!

జీర్ణించుకోవడం కష్టమవుతోంది..!

చూస్తుండగానే చేతిలో ఉన్నది చేజారిపోతుంటే జీర్ణించుకోవడం కష్టమే. ప్రస్తుతం టీడీపీ నేతల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం నుంచి 2014 ఎన్నికల వరకూ ఆంధ్రప్రదేశ్‌లో బీసీలు మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన హయంలో బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేశారు. ఆ సామాజికవర్గ ప్రజలకు చేతనైన మేలు చేశారు.

నాడు ఎన్టీరామారావు వేసిన పునాదులపై టీడీపీ బండిని నడిపిన చంద్రబాబునాయుడు 2014 వరకూ నెట్టుకొచ్చారు. చంద్రబాబు హయాంలో బీసీలకు రాజకీయ ప్రాథాన్యం క్రమంగా తగ్గిపోయింది. మరో వైపు బీసీ సామాజికవర్గ ప్రజల ఆర్థిక అభ్యున్నతికి బాబుగారు చేసిందీ చెప్పుకొవడానికి ఏమీ లేదు. ఆసరా పథకం అంటూ.. ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్‌ మెషిన్లు ఇచ్చి కుల వృత్తులు చేసుకోండని సెలవిచ్చారు. ఈ పథకం కింద వచ్చిన వస్తువులు తిరిగి సగం రేటుకు మార్కెట్‌లోకి వచ్చాయంటే.. బాబు అమలు చేసిన పథకాలు బీసీ సామాజికవర్గ ప్రజలకు ఏమేరకు మేలు చేశాయో స్పష్టంగా చెప్పాయి.

2019 ఎన్నికల్లో అన్ని సామాజికవర్గ ప్రజలు వైఎస్‌ జగన్‌ను ఆదరించారు. ఈ ఎన్నికల్లోనే తమకు ఆది నుంచి వెన్నంటి ఉన్న బీసీలు దూరం అవుతున్నారని టీడీపీ నేతలకు అవగతమైంది. తనను ఆదిరించిన అన్ని సామాజికవర్గ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌.. తాను ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా మునుపెన్నడూలేనంతగా లబ్ధి జరుగుతోంది. వైఎస్సార్‌ నేతన్న హస్తం, చేదోడు, వైఎస్సార్‌ చేయూత.. ఇలా అనేక పథకాలతో బీసీ సామాజికవర్గ ప్రజలకు ఆర్థికంగా మేలు జరుగుతోంది.

బీసీలు.. బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌లు కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాసులంటూ వైఎస్‌ జగన్‌ వారికి రాజ్యాధికారం కూడా దక్కేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన మంత్రివర్గంలో 60 శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. తాజాగా బీసీల అభివృద్ధికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటికి పాలక మండళ్లను నియమించారు. 56 చైర్మన్‌ పోస్టులు, 672 డైరెక్టర్‌ పోస్టులు.. వెరసి ఏపీలో 13 జిల్లాల్లోని బీసీ సామాజికవర్గ నేతలు 728 మందిని నామినేటెడ్‌ పోస్టుల్లో నియమించారు.

ఇదే ఇప్పుడు.. టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలు దూరం అయ్యారని, తిరిగి వారిని దగ్గరచేసుకునేందుకు నేతలు పని చేయాలంటూ ఇటీవల నిర్వహించిన జూమ్‌ మహానాడు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయితే బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మేలుతో టీడీపీ నేతలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మళ్లీ బీసీలకు దగ్గరయ్యేందుకు ఒక్క అవకాశం కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో శివాలెత్తిపోతున్నారు. బీసీ సామాజికవర్గ ప్రజలకు కొత్త పథకం ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీలోని బీసీ నేతలు మీడియా ముందుకు వచ్చి సదరు పథకంపై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా.. బీసీ కార్పొరేషన్లకు పాకల మండళ్లను నియమించడంతో మరోమారు ఆ పార్టీలోని బీసీ నేత అయిన చింతకాయల అయ్యన్న పాత్రుడు మైక్‌పుచ్చుకుని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాల మధ్య వైసీపీ ప్రభుత్వం చిచ్చుపెడుతోందంటూ అర్థరహితమైన విమర్శలు చేశారు. పైగా.. చైర్మన్లకు కనీసం కుర్చి అయినా ఇస్తారా..? అంటూ తమ కడుపుమంటను అయ్యన్నపాత్రుడు చాటుకుంటున్నారు. టీడీపీ నేతల మాటల ద్వారా.. బీసీలు తమకు శాశ్వతంగా దూరం అవుతున్నారనే భయం వారు ప్రవర్తిస్తున్న తీరులో స్పష్టంగా కనిపిస్తోంది.