iDreamPost
android-app
ios-app

అసత్య ప్రచారాలతో తెలుగుదేశం నేతల బరితెగింపు

  • Published Oct 12, 2020 | 9:50 AM Updated Updated Oct 12, 2020 | 9:50 AM
అసత్య ప్రచారాలతో తెలుగుదేశం నేతల బరితెగింపు

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ప్రవర్తన రోజు రోజుకి దిగజారిపొతుంది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం నేతల చేతుల్లో సోషల్ మీడియా ప్లాట్ఫాంలు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. ఒక పక్క ముఖ్యమంత్రి జగన్ తన పాలనతో, పథకాల అమలుతో ప్రజల మన్ననలు పొందుతూ దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో అగ్రగామిగా నిలుస్తుంటే, జగన్ ప్రభుత్వంపై, పాలనపై విమర్శించేందుకు సహేతుకమైన అంశం ఏదీ దొరకక పోవడంతో తెలుగుదేశం నేతలు ఏమి చేయాలో పాలుపోక కులాలు, మతాలు, అమరావతి అంటు లేని ఉద్యమాలను సాగతీస్తూ వచ్చారు.

అయితే అటు అమరావతి ఉద్యమంలోను ఇటు మత రాజకీయంలోను పని కట్టుకుని చేయిస్తున్న రగడని ప్రజలు పట్టించుకోకపోవడంతో నేరుగా తెలుగుదేశం నేతలే సోషల్ మిడియా వేదికగా అసత్యాలను ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ట్విట్టర్ ఖాతా నుండి ఎక్కడో తెలంగాణాలో జరిగిన రోడ్డులో లారీ కుంగిన ఉదంతాన్ని పట్టుకొచ్చి జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగినట్టు అసత్య ప్రచారానికి పూనుకున్నారు.

అదే విధంగా తెలుగుదేశానికి చెందిన మహిళా నేత అనురాధా తన ట్విట్టర్ ఖాతా నుండి ఎప్పుడో తెలుగుదేశం పాలనా హయాంలో గిరిజన బాలికలపై జరిగిన లాఠీఛార్జ్ ఫోటోను పట్టుకుని వచ్చి జగన్ ప్రభుత్వంలో అమరావతి రైతులపై జరుగుతున్న దమనకాండ అంటూ పోస్ట్ చేశారు. ఇక తెలుగుదేశం అధ్యక్షుడి కుమారుడు నారాలోకేష్ అయితే ఏకంగా అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని పట్టుకుని సదరు వ్యక్తి అమరావతి ఉద్యమంలో చనిపోయాడు అని తన ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ చేయగా చనిపొయిన వ్యక్తి కుమార్తే లోకేష్ తీరుని ఖండిచడం జరిగింది.

ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం నేతలు జగన్ ప్రభుత్వం పై బురద జల్లటానికి సోషల్ మీడియా వేదికగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారనేది స్పష్టం అవుతుంది. ఒకే సారి ఇలా వరస పెట్టి తేదాపా నేతలే అసత్యాలుప్రచారం చేయడం యాదృచ్చికం కాదని, ఈ వ్యవహారం మొత్తం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కనుసన్నలోనే జరుగుతునదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం దిగజారిపోయి వ్యవహరిస్తున్న ఈ పద్దతితో కొంతమంది రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తుంటే మరికొంతమంది వైకాపా అభిమానులు మాత్రం వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.