iDreamPost
android-app
ios-app

పంచాయతీ పోరు.. అచ్చెం నాయుడుకు షాకిచ్చిన సోదరుడి కుమారుడు

పంచాయతీ పోరు.. అచ్చెం నాయుడుకు షాకిచ్చిన  సోదరుడి కుమారుడు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకు ఆయన సోదరుడు కుమారుడు షాకిచ్చారు. అచ్చెం నాయుడు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ ఎన్నికల్లో కింజారపు అప్పన్న పోటీకి సిద్ధమయ్యారు. పోటీ చేయొద్దంటూ అచ్చెం నాయుడు వారించినా.. అప్పన్న ససేమిరా అన్నారు. ఫోన్‌లో బెదరించినా, ఇంటికి మనుషులను పంపి మంతనాలు సాగించినా.. అప్పన్న శాంతించలేదు. తనను అసలు పట్టించుకోలేదని, టీడీపీ ప్రభుత్వ హాయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఉన్న అప్పన్న వైసీపీ మద్ధతుతో పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసేందుకే మొగ్గు చూపారు. ఈ రోజు నామినేషన్‌ వేసేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు.

స్వగ్రామంలో తన సోదరుడి కుమారుడు నుంచే ఎదురైన పోటీని ఊహించని కింజారపు అచ్చెం నాయుడు తికమకపడుతున్నారు. ఎలాగైన గ్రామంలో పట్టునిలుపుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పన్న నామినేషన్‌ వేయకుండా అడ్డుకుకోవాలని తన కుటుంబ సభ్యులను, స్థానిక టీడీపీ నేతలను పురమాయించారు. అప్పన్నను నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు అచ్చెం నాయుడు సోదరుడు హరిప్రసాద్‌ సిద్ధమయ్యారు. నామినేషన్‌ వేసేందుకు పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లిన అప్పన్నను బలవంతంగా బయటకు తీసుకొచ్చేందుకు హరిప్రసాద్‌ యత్నించారు.

సీఐపై దాడి..

నిమ్మాడలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు టెక్కలి సీఐ నీలయ్య ఆ గ్రామానికి చేరుకున్నారు. నామినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేలా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలీసులు ఊహించినట్లే నామినేషన్‌ దాఖలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అప్పన్నపై హరిప్రసాద్, టీడీపీ నేతలు దాడికి దిగారు. వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీఐ నీలయ్యపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ నీలయ్య యూనిఫాం చిరిగిపోయింది.