iDreamPost
iDreamPost
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని నియంత్రించేందుకు జగన్ సర్కారు రంగం సిద్ధం చేసిందా.. దానికి అనుగుణంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోందా.. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు సమాయత్తం అవుతోందా..ఏక వ్యక్తి కమిషన్ కాకుండా ముగ్గరు సభ్యులను నియమించాలని ఆలోచిస్తోందా..అంటే అవుననే సమాధానం వస్తోంది టీడీపీ అనుకూల మీడియా నుంచి. ఎస్ ఈ సీ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా మారిన వ్యవహారంలో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి ఆ వర్గపు మీడియాలోనే ఎక్కువ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో టీడీపీ నేతల్లో కలవరం కనిపిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ విషయంలో కూడా ఇదే తీరు కనిపించింది. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వైరం పెంచుకునేందుకు ప్రయత్నించారు. చివరకు ఆయనకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం తన దారిన తాను నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇప్పుడు ఒంటరిగా మారిపోయిన ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తాజాగా గవర్నర్ ని కలిసి తన గోడు చెప్పుకున్నారు. తనకు అధికారాలు పరిమితం చేసేశారని వాపోయారు.
అదే రీతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కూడా పరిస్థితి ఎదురవుతుందని ఊహించుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘంలో మాత్రమే ఇప్పటి వరకూ ముగ్గరు కమిషన్ సభ్యులున్నారు.అది కూడా 1989 లో ఏర్పడిన వివాదం నేపథ్యంలో వీపీ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత పీవీ నరసింహరావు కాలంలో రాజ్యాంగ సవరణ ద్వారా ముగ్గురు సభ్యుల కమిషన్ శాశ్వతం అయ్యింది. 1994లో ఏర్పాటు అయిన రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఇప్పటి వరకూ ఏక సభ్యుడితోనే కొనసాగుతోంది. కానీ తాజా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆంధ్రజ్యోతి కలవరపడుతున్న తీరు విశేషంగా కనిపిస్తోంది.
జగన్ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుందా లేక మరో మార్గంలో తన వైఖరి చాటుతుందా అన్నది ఇప్పటి వరకూ స్పష్టత లేదు. తాజాగా కోర్ట్ తీర్పు తర్వాత వ్యవహారం మరింత ముదరకుండా జాగ్రత్త పడాల్సిన ఎస్ ఈ సీ దానికి భిన్నంగా వ్యవహరించారు. వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన రాసిన లేఖ విషయంలో జరిగిన దోబూచులాట దానికో ఉదాహరణ. దాంతో జగన్ సర్కారుకు కూడా తాడోపేడో తేల్చుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ స్థితిలో కీలక నిర్ణయం అనివార్యం అవుతోంది. అదే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువుడుతుందనే దానిపై చర్చ సాగుతోంది. ఈలోగానే పచ్చమీడియా పదనిసలు గమనిస్తుంటే ఎంతగా కలవరపుడుతున్నారాన్నది స్పష్టం అవుతోంది