iDreamPost
android-app
ios-app

రాజీ పడింది.. హక్కులు వదులుకుంది ఎవరు సోమిరెడ్డి..?

రాజీ పడింది.. హక్కులు వదులుకుంది ఎవరు సోమిరెడ్డి..?

తమ ప్రభుత్వ హాయంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్, కృష్ణా జలాలు సహా అన్ని అంశాలపై హక్కులు వదులుకుని కేసీఆర్‌తో రాజీపడి వచ్చిన టీడీపీ నేతలు.. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తుండడం విడ్డూరంగా ఉంది. రాయలసీమ ప్రజల తాగు, సాగు నీటి విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌.. తెలంగాణ ప్రభుత్వంతోనూ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ రాజీపడుతున్నారని విమర్శించారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. కృష్ణా జలాల విషయంలో మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కూడా సోమిరెడ్డి గాలిలో పిడిగుద్దులు వర్షం కురిపిస్తున్నారు.

జగన్‌ మాట సోమిరెడ్డి వినలేదా..?

కృష్ణా జలాల విషయంలో మనకు ఉన్న హక్కులు, నీటి వినియోగంపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఇటీవల రాయదుర్గం సభలో స్పష్టంగా వివరించారు. శ్రీశైలంలో 800 అడుగుల వద్దే మీ వాటా మీరు వాడుకుంటున్నప్పుడు.. తాము కూడా 800 అడుగుల వద్ద రాయలసీమ లిఫ్ట్‌ పెట్టి తమ వాటా నీటిని వాడుకుంటే తప్పు ఏముందని..?సూటిగా ప్రశ్నించారు. గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని. ఏ రాష్ట్రమైనా రైతుల ప్రయోజనాలే ముఖ్యంగా పాలకులు పని చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నా.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు, కృష్ణా నది యాజమాన్య మండలికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించింది.

Also Read : క్రీడా ప్రేమికుడు పీఆర్‌ మోహన్‌

నిన్నటి రోజు మరిచిపోయారా..?

రాజీ పడడాలు, హక్కులు వదులుకోవడాల గురించి సోమిరెడ్డి మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఇంకా ఏపీ ప్రజలు మరచిపోలేదు. విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయి.. అడ్డంగా ఆడియో, వీడియో ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. ఆ కేసు నుంచి దేవుడు కూడా చంద్రబాబును కాపాడలేడని కేసీఆర్‌ ప్రకటించారు. అలాంటిది తెలంగాణ రాజకీయాలలో, మరే ఇతర అంశాలలో వేలు పెట్టబోనని, హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతానని చెప్పి.. ఆ కేసు నుంచి తప్పించుకుని కృష్ణా నది కరకట్టపైకి చంద్రబాబు వచ్చిన విషయం ఏపీ ప్రజలకు గుర్తుంది. తాను కేసులు, అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. హైదరాబాద్‌పై ఉన్న పదేళ్ల హక్కును, అక్కడ ఉన్న ఆస్తులను వదిలేసి ఉత్త చేతులో రావడం సోమిరెడ్డికి గుర్తులేనట్లుగా ఉంది.

రాజీ కొనసాగేందుకు… హక్కులపై బండలు..

దిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు కడుతున్నా.. మాట మాత్రం అడ్డుచెప్పని చంద్రబాబు.. ఇప్పటికీ ఆ ప్రాజెక్టులపై నోరుమెదపడం లేదు. పైగా.. తెలంగాణకు మేలు చేసేలా.. వారి వాదనకు బలం చేకూరేలా.. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లా ఏడారిగా మారిపోతుందంటూ.. జిల్లాలోని తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రకటనలు చేయిస్తున్నారు. ఓటుకు నోటు కేసు వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం వెలకట్టలేనిది. ఇప్పటికీ ఆ కేసు విచారణ జరుగుతోంది. ఆ భయంతో.. కేసీఆర్‌తో రాజీ కొనసాగించేందుకు.. రాష్ట్ర హక్కులను కాలరాసేలా ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారనేందుకు తాజాగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనే నిదర్శనం.

Also Read : రాయలసీమ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు ఎలా నష్టం..?