Idream media
Idream media
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పూర్వ వైభవం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత సీనియర్లతో పాటు గతంలో ఓ వెలుగు వెలిగిన కీలక నేతలపై దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశంలో ఉండి తెలంగాణలో చక్రం తిప్పిన నేతలు, నాడు వైఎస్. రాజశేఖర్ రెడ్డి వెంట నడుస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టతకు పాటుబడిన వారు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేలా కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఫలితాలు కూడా సాధిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో దేవేందర్ గౌడ్ నివాసంలో రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లోకి దేవేందర్ గౌడ్‌ను ఆయన ఇద్దరు కుమారులను కూడా ఆహ్వానించారు.
వరుస భేటీలు..
మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు, గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పని చేసిన ఎర్ర శేఖర్, గతంలో కాంగ్రెస్ లో ఉండి డి. శ్రీనివాస్ తో పాటు టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ తనయుడు సంజీవ్, వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర సత్యనారాయణ, అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నేతలు మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదిలాబాదు జిల్లాకు చెందిన ప్రస్తుత టీఆర్ఎస్ సీనియ ర్ నాయకులు మాజీ మంత్రి వేణుగోపాల చారి, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. నల్గొండ జిల్లా కు చెందిన మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ లతో కూడా చర్చలు జరుపుతోంది. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ లతో కాంగ్రెస్ బృందం చర్చల జరుపుతోంది. ఆయా పార్టీలను కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఓ కాంగ్రెస్ బృందం ప్రత్యేకంగా అదే పనిలో నిమగ్నమైంది. రేవంత్ రెడ్డి, మధుయాస్కి గౌడ్. షబ్బీర్ అలీ, రామిరెడ్డి దామోదర్ రెడ్డి తదితర నేతలు కీలక నేతలను కలుస్తున్నారు.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్, ఇటీవల ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన హరిశంకర్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కి పీసీసీ చీఫ్ నియామాకాన్ని వ్యతిరేస్తూ పార్టికి రాజీనామా చేసిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ ను కూడా తిరిగి పార్టీలోకి వచ్చేలా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అందర్నీ కలుపుకుపోతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ కాంగ్రెస్ నేతల్ని కలిసి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు. వారు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు.
Also Read : న్యాయ రాజధాని దిశగా తొలి అడుగు!
దేవేందర్ గౌడ్ సుముఖత
మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు తెలంగాణ రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా పేరు పొందారు. ఆ పార్టీలో అత్యున్నత పదవులు పొందిన ఆయన ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి సొంతంగా నవ తెలంగాణ పేరుతో పార్టీని కూడా స్థాపించారు. అనంతరం ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి ఆ పార్టీ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఒకేసారి పోటీ చేసి రెండింటిలోనూ ఓడిపోయారు. మళ్లీ టీడీపీకి గూటికి చేరిన దేవేందర్ గౌడ్ చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే దేవేందర్ గౌడ్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో రేవంత్ ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన తనయుడు వీరేందర్ గౌడ్,పెద్ద కుమారుడు విజయేందర్ గౌడ్‌లను రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరేందర్ గౌడ్ రెండేళ్ల క్రితం ఆయన బీజేపీలో చేరారు. అంతకుముందు, 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో ఇక ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. వీరేందర్ గౌడ్‌ను కూడా రేవంత్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక పార్టీ బలోపేతంపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మొదట సొంత పార్టీలో సీనియర్లందరినీ కలిసి తాను అందరివాడిని సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి,జీవన్ రెడ్డి లాంటి కొందరు నేతలు ఆయన్ను దూరం పెట్టినప్పటికీ మిగతా సీనియర్లను కలిసి వారి సహకారాన్ని కోరారు. ఇదే క్రమంలో ఇతర గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ఆ తర్వాత పార్టీకి దూరమైనవారు, ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై రేవంత్ దృష్టి సారించారు. వీళ్లందరినీ కాంగ్రెస్ గూటికి చేర్చడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవేందర్ గౌడ్‌తో భేటీ చర్చనీయాంశంగా మారింది. రేవంత్ ఆహ్వానంతో దేవేందర్ గౌడ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also Read : హుజూరాబాద్ లో ఈటల జమున పోటీ చేయాలనుకుంటున్నారా..?