iDreamPost
android-app
ios-app

సాక్ష్యాలుంటే బయటపెట్టేందుకు ఇంతకన్న మంచితరుణమేమున్నది బండారు..?

సాక్ష్యాలుంటే బయటపెట్టేందుకు ఇంతకన్న మంచితరుణమేమున్నది బండారు..?

వైసీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల పేరిట వసూళ్లు చేశారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల నుంచి 400 కోట్ల రూపాయలు తీసుకున్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు బయటపెడతా.. ఇదీ మాజీ మం్రత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ పలికిన లడాయి మాటలు.

విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం చేయడంలో విజయసాయి రెడ్డిది కీలక పాత్ర. 2014లో విశాఖ లోక్‌సభ నుంచి వైఎస్‌ విజయమ్మ ఓటమిపాలైన తర్వాత విశాఖను అంటిపెట్టుకుని ఉన్న విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో వైసీపీని చక్కదిద్దారు. పార్టీని, నేతలను ఏకతాటిపై నడిపిస్తూ గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఘన విజయం సాధించేలా చేశారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ విజయసాయి రెడ్డి ఆత్మసై్థర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నుంచి మొదలుకొని ఆ పార్టీలోని విశాఖ నేతలు వరకూ ప్రతి ఒక్కరికి విజయసాయి రెడ్డే లక్ష్యంగా మారారు అంటే.. ఆయన టీడీపీకి ఏ స్థాయిలో కొరగానికొయ్యలా మారారో తెలుస్తోంది.

విజయసాయి రెడ్డిపై చేసే ఆరోపణలలో భాగమే తాజాగా బండారు చేసిన 400 కోట్ల రూపాయల వసూళ్లు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ విజయావకాశాలు తగ్గించేందకు టీడీపీ నేతలు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ ప్రభుత్వ పాలనను, ప్రభుత్వ పథకాలను, ఎన్నికల వేళ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల అమలు.. ఇలా ఏ విషయంలోనూ విమర్శలు చేసేందుకు టీడీపీ నేతలకు ఒక్క అవకాశం కూడా లభించడం లేదు.

అందుకే వైసీపీ నేతలు దందాలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అసలు దందాలు ఎవరు చేశారో, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో విశాఖ ప్రజలందరికీ తెలుసు. భూ దందా ఎలా జరిగిందో, అందులో ఎవరెవరు ఉన్నారో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) త్వరలోనే బయటపెట్టబోతోంది.

బండారు చేసిన 400 కోట్ల రూపాయల వసూళ్ల ఆరోపణల్లో వాస్తవం ఎంత అనేది ఆయనే చెప్పారు. ఓ పక్క 400 కోట్ల రూపాయలు వసూళ్లు చేశారని చెబుతూ.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బండారు చెప్పుకొస్తున్నారు. అయితే వాటిని ఇప్పుడు బయటపెట్టనని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని చెప్పడంతోనే అందులో వాస్తవం ఎంతనేది తేలిపోయింది.

విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందుకోసం విజయసాయిరెడ్డి 400 కోట్లు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల నుంచి వసూళ్లు చేస్తే.. ఆ దందాను బయటపెట్టేందుకు ఇంతకన్నా మంచి సమయం ఏముంది..? ఇప్పుడు బయటపెడితే విజయసాయిరెడ్డిపై టీడీపీ ఇప్పటి వరకు చేసిన ఆరోపణలకు బలం చేకూరుతుంది. ఆ ప్రభావం విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికలపై పడుతుంది. అంతిమంగా కార్యనిర్వాహక రాజధానిలో వైసీపీ నష్టపోతుంది. దీని వల్ల విశాఖ కార్పొరేషన్‌ను కోల్పోవడమే కాకుండా.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించడం స్థానిక ప్రజలకు ఇష్టం లేదని కూడా టీడీపీ నేతలు చెప్పుకోవచ్చు.

మరి ఇంత మంచి అవకాశాలను వదులుకుని సమయం వచ్చినప్పుడు బయటపెడతానంటే.. దాని వెనుక అర్థం ఏమిటి..? అంటే తన వద్ద ఉన్న ఆధారాలతో.. వైసీపీకి డబ్బులు ఇచ్చిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను బెదిరించి.. వారికి ఇచ్చారు కాబట్టి నాకు ఇవ్వండి అంటూ వారి వద్ద నుంచి బండారు సత్యనారాయణ వసూళ్లు చేయాలని భావిస్తున్నారా..? అప్పటికీ వారి నుంచి చిల్లర రాకపోతే.. అప్పుడు బయటపెట్టాలనుకుంటున్నారా..? అదేనా బండారు చెప్పిన సమయం..?

ఆరోపణలు చేసి, ఆపై ఆధారాలు కూడా ఉన్నాయంటూ చెప్పినవారెవ్వరూ వాటిని బయటపెట్టకుండా బండారు మాదిరిగా బడాయి మాటలు పలకరు.