Idream media
Idream media
తిమ్మిని బమ్మిని చేయగల నేర్పు ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలను చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ నేర్పుతోపాటు.. ప్రచార మాధ్యమాల మద్ధతు కూడా ఉంటేనే తిమ్మిని బమ్మిని చేయడం సాధ్యం. ఇలా చేయగల నేర్పు, మీడియా మద్ధతు ఉన్న పార్టీలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే.. ముందు వరుసలో నిలిచే పార్టీ తెలుగుదేశం. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ.. అవి నిజమని నమ్మించడం.. తమపై వచ్చే ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలేనని ప్రజలను మభ్యపెట్టడంలో ఈ పార్టీది అందవేసిన చేయి అని తాజాగా జరిగిన ఐటీ సోదాలతో మరోమారు స్పష్టమవుతోంది.
చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్, సన్నిహితులపై ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిపిన సోదాల్లో రెండు వేల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు, లెక్కల్లో చూపని డబ్బు చేతులు మారిందని గుర్తించింది. దీనిపై ఐటీ శాఖ స్వయంగా పత్రికా ప్రకటన వెలువరించింది. ఈ విషయాన్ని ఓ వర్గం మీడియా ఐటీ శాఖ ఇచ్చిన ప్రకటనను యథావిధిగా ప్రచురించి చేతులు దులుపుకోగా.. మరో వర్గం మీడియా మాత్రం ఐటీ సోదాల అనంతరం పూర్వా పరాలపై కథనాలు ప్రచురించింది. చంద్రబాబు మాజీ పీఎస్, సన్నిహితుల ఇంట్లో సోదాల్లో రెండు వేల కోట్లు దొరకడంతో.. అదంతా చంద్రబాబు జరిపిన వ్యవహారమేనని ఆ వర్గం మీడియా కథనాలు ప్రచురించింది/ప్రచారం చేసింది. ఈ సోదాలపై టీడీపీ నేతలు, వైఎస్సార్‌సీపీనేతలు పరస్పర ఆరోపణలు జొప్పించుకున్నారు. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డిలు మాత్రం స్పందించలేదు.
మీడియా చెప్పినా.. చెప్పకపోయినా.. రెండు వేల కోట్ల వెనుక చంద్రబాబు ఉన్నారన్న విషయం సామాన్యులకు అర్థమవుతోన్న క్రమంలో టీడీపీ నేతలు తమ నేర్పును ప్రదిర్శిస్తున్నారు. రెండువేల కోట్లు అన్న ఐటీశాఖ ప్రకటననే మరిచిపోయేలా.. అదేఐటీ శాఖ ఇచ్చిందని చెప్పకొస్తున్న గులాబీ రంగు పత్రంలోని వివరాలను ఫోకస్ చేస్తున్నారు. ఐటీ సోదాల్లో చంద్రబాబు పీఎస్ ఇంట్లో రెండు లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే గుర్తించారని, అదీ కూడా లెక్కలు చూపించడంతో తిరిగి ఇచ్చేశారని చెప్పుకొస్తున్నారు. ఐటీ శాఖ ఇచ్చిన రెండువేల కోట్ల ప్రకటనను పట్టించుకోని ఓ వర్గం మీడియా.. ఈ విషాయాన్ని మాత్రం బాగా ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా టీడీపీ నేతల వాదనను బలంగా వినిపిస్తోంది.
ఇలా తమ వాదనను బలంగా వినిపిస్తున్న టీడీపీ నేతలు ఇదే మార్గంలో మరో అడుగు ముందుకేశారు. ఐటీ దాడుల వ్యవహారంలో తమ పార్టీ అధినేత చంద్రబాబుపై సాక్షి మీడియా, వైఎస్సార్‌సీపీ నేతలు దుష్స్రచారం చేశారని, వారిపై పరువునష్టం దావా వేస్తామంటూ.. టీడీపీనేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరికలు జారీ చేస్తూ.. తనదైన శైలిలో ఐటీ సోదాల వ్యవహారాన్ని తిప్పికొడుతున్నారు. ఆరు రోజుల పాటు సోదాలు జరిపినా.. ఐటీ శాఖకు ఏమీ దొరకలేదని, అంతా క్లీన్ చిట్ ఇచ్చిందన్న వాదనను బలంగా వినిపించేలా టీడీపీ పకడ్బంధీ వ్యూహాన్ని అమలు చేస్తోంది.