Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పుంజుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అయినప్పటికీ పార్టీలో ముఖ్య నేతలు, వాయిస్ ఉన్న నేతలు పార్టీని కాపాడేందుకు ముందుకు రావడం లేదు. ఎక్కడా వారి మాటలు వినిపించడం లేదు. దీని వెనుక ప్రధాన కారణం ఉందని సోషల్ మీడియాలోను, పార్టీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. గట్టిగా మాట్లాడే సబ్జెక్టున్న నేతలను కావాలనే మాట్లాడనీయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుమారుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను పైకి లేపేందుకు ఈ తరహా ఆదేశాలు జారీ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. రాష్ట్రంలో, పార్టీలో ఎక్కువగా లోకేష్ వాయిస్ మాత్రమే వినిపించేలా చేసి, 2024 ఎన్నికల నాటికి ఆయనను కీలక నేతగా నిలబెట్టేందుకు బాబు తాపత్రయపడుతున్నారట.
వారి వాయిస్ వినిపించడం లేదెందుకు?
సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ మాత్రమే తెరపై ఎక్కువగా కనిపిస్తున్నారు. మీడియా సమావేశాలు, జగన్ కు లేఖలు, పరామర్శలు, యాత్రల ద్వారా నిత్యం వార్తల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎక్కువగా మీడియా ముందుకు వచ్చే ప్రముఖులు ఇటీవల కాలంలో పెద్దగా మాట్లాడడం లేదు. అలాగే స్పోక్ పర్సన్ గా పేరున్న, 2019లో వైసీపీ హోరు గాలిలో కూడా నాలుగు వేల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవులు లాంటి వారైతే అసలు కనిపించడం లేదు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మంచి వాగ్దాటి. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు, ప్రసంగాలకు గతంలో ఆయనకు సంసద్ రత్న పురస్కారం కూడా లభించింది. కానీ వీరెవరూ కీలక సందర్భాల్లో కూడా తమ గళాన్ని వినిపించడం లేదు. ఊ.. అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సీనియర్లు కూడా కొంత కాలంగా కనిపించడం లేదు.
ఎలాగైనా బాబే ఫోకస్ కావాలి..
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ అంతగా లైవ్ లోకి రాలేదు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తప్పా, ప్రజాక్షేత్రంలో ఆయన వాయిస్ పెద్దగా వినిపించేది కాదు. అందుకే జనం ఆయనను జనం గుర్తించడం లేదని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో కొద్ది కాలంగా ఏపీ టీడీపీలో లోకేష్ మాత్రమే ఫోకస్ అయ్యేలా చంద్రబాబు వ్యూహాలు రచించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే పార్టీలో కొందరికి మాత్రమే వాక్ స్వాతంత్య్రం ఇచ్చారని, మిగిలిన వారి వాయిస్‌కు బ్రేకు వేశారని తాజాగా ప్రచారం తెరమీదికి వచ్చింది. ఏపీ ప్రభుత్వంపై నిరనల్లోనూ, కరోనా సేవల విషయంలోను, ఆక్సిజన్ లేక మరణిస్తున్నవారి విషయంలోనూ ఇప్పుడు తాజాగా పరీక్షల రద్దు వంటి అంశాల్లోనూ లోకేష్ పేరిటే ఎక్కువగా స్టేట్ మెంట్లు వినిపిస్తున్నాయి.
మాట్లాడతామంటే ఆగండి అంటున్నారు..
టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రభుత్వంపై అన్ని వైపులా నుంచి దాడి చేయాలని.. టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ ఛాన్స్ కొందరికే ఇచ్చారని .. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. యువ నాయకులు, మహిళా నేతలు సైతం పేర్కొంటున్నారు. దీనికి రీజన్ తెలియడం లేదని కూడా వారు పేర్కొంటుండడం గమనార్హం. ఈ పరిణామం ప్రస్తుతం తీవ్రస్తాయికి చేరుతోంది. “మేం కూడా పార్టీలో రెండు దశాబ్దాలుగా ఉన్నాం. అనేక విషయాల్లో మాట్లాడాం. కానీ, ఇప్పుడు మాత్రం మేం మాట్లాడతామంటే.. ఆగండి అని చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నారో .. అర్ధం కావడం లేదు“ అని కొందరు సీనియర్లు వాపోతున్నారట.
వారికి మాత్రమే అవకాశం
ఇక, టీడీపీ ఎమ్మెల్సీలు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. వృద్ధ నేతలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని వారు మాత్రం మీడియా ముందుకు వస్తున్నారు. జగన్ సర్కారుపై విమర్శలు సంధిస్తున్నారు. దీనికి రీజనేంటి ? అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం లోకేష్ ను డామినేట్ చేయని వారిని మాత్రమే మాట్లాడేందుకు అనుమతి ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న యువత, మహిళా నేతలకు అవకాశం ఇస్తే.. లోకేష్‌ను డామినేట్ చేస్తారని.. చంద్రబాబు భావిస్తున్నట్టు ఒక వర్గం పేర్కొంటోంది. దీంతో ఇప్పుడు టీడీపీ తరఫున ఆ నలుగురు మాత్రమే మాట్లాడుతుండడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఏ తీరాలకు పోతుందో ? చూడాలి.