iDreamPost
iDreamPost
వరుస మారలేదు. ఏడాది తర్వాత కూడా ఏకగ్రీవాల పరంపర ఆగలేదు. మళ్లీ వైఎస్సార్సీపీదే హవా. అధికార పార్టీకి అడ్డులేదన్నట్టుగా మారింది. నెల్లూరు నగర పాలకసంస్థలోనూ అదే తీరు కనిపిస్తోంది. 54 డివిజన్లు గల ఈ కార్పోరేషన్ ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన ప్రతిపక్షానికి అభ్యర్థులే కరువయిన నేపథ్యం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. టీడీపీ తీరుని తేటతెల్లం చేస్తోంది. తెలుగుదేశం ముఖ్యనేతలే మొఖం చాటేస్తున్న తరుణంలో ఆపార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది.
నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఊపు కొనసాగుతోంది. దానిని అడ్డుకోవాలని టీడీపీ అధిష్టానం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కానీ క్షేత్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. టీడీపీ తరుపున రంగంలో నిలిచేందుకు అభ్యర్థులే కనిపించడం లేదు. దాంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి ఎంత మందిని రంగంలో దింపగలమన్నది వారికి అంతుబట్టడం లేదు. ఇప్పటి వరకూ ఎక్కువ డివిజన్లలో పోటీకి సిద్ధపడే వారే కరువవుతున్న తరుణంలో ఏం చేయాలన్నది పాలుపోని నేతలు అటు జనసేన, ఇటు లెఫ్ట్ పార్టీల వైపు చూస్తుండడం విస్మయకరంగా కనిపిస్తోంది.
ఈనెల 9వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. మొత్తం అన్ని డివిజన్లకు అభ్యర్థులను రంగంలో దింపాలని చంద్రబాబు ఆదేశిస్తున్నారు. కానీ సీన్ అలా కనిపించడం లేదు. ఇప్పటి వరకూ 155 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో బరిలో నిలిచేవారెందరూ అనేది స్పష్టత లేదు. అభ్యర్థుల విషయంలో నాయకులకే క్లారిటీ కనిపించడం లేదు. దాంతో వరుసగా రెండో సారి కూడా ఈ కార్పోరేషన్ ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకునే దిశలో ఉంది. అందులోనూ అత్యధికంగా ఏకగ్రీవాలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. గత కార్పోరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 32 డివిజన్లు, టీడీపీ 17, బీజేపీ 2, సీపీఎం, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఒక్కొక్కటి చొప్పున గెలిచారు. ఈసారి కనీసం నాలుగైదు డివిజన్లలోనయినా పట్టు సాధింగచలమా అనే అనుమానం టీడీపీలోనే కనిపిస్తోంది.
ఇప్పటికే తాము రంగంలో దిగలేని చోట మద్ధతు ఇస్తామంటూ నెల్లూరు టీడీపీ నేతలు జనసేన, లెఫ్ట్ పార్టీలతో మంతనాలు ప్రారంభించారు. అయితే అవన్నీ కొలిక్కి వచ్చేనా అనేది కూడా సందేహమే. ఈ నేపథ్యంలో గత ఏడాది మునిసిపల్ ఎన్నికల ఏకగ్రీవాల పరంపర నెల్లూరులో కూడా కొనసాగడం దాదాపు ఖాయంగా ఉంది. ఇది టీడీపీ నేతలకు అవమానంగా మారుతున్నప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఆపార్టీ ఉంది.