iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ పెను సంచలనం. అనేక మార్పులకు నాంది ప్రస్థానం. రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసిన చరిత్ర. స్వల్పకాలంలోనే పాలనా పగ్గాలు సాధించిన ప్రాంతీయ కెరటం. అధికారం చేపట్టిన తర్వాత అనేక కీలక నిర్ణయాలతో సరికొత్త వ్యవస్థీకృత వ్యవహారాలకు నాంది పలికన ఘనత. ప్రపంచీకరణ యుగంంలో అందరికన్నా ముందుగా ప్రపంచబ్యాంకును ఆవహించుకున్న వ్యవస్థ. నాయకత్వం మారినా పట్టు కోల్పోకుండా గడిచిన నాలుగు దశాబ్దాలలో ఎక్కువకాలం పాలించిన పార్టీగా గుర్తింపు. ఎన్టీఆర్ ఛరిష్మాతో ఎదిగి, చంద్రబాబు నేతృత్వంలో నిలబడిన తీరు కూడా ఓ విశేషమే. పలు సందర్భాల్లో జాతీయ స్థాయిలోనూ సత్తా చాటిన అనుభవం. కానీ రెండు కళ్ల సిద్ధాంతం తర్వాత రెండు రాష్ట్రాలుగా మారిన నేపథ్యంలో పునాదులకే బీటలు వారుతున్న తీరు కలవరపరుస్తోంది. భవిష్యత్ ఏమిటోననే బెంగ ఆపార్టీలో పుట్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణా అనుభవాలతో ఆంధ్రప్రదేశ్ లో ఎలా గట్టెక్కాలో తెలియని సందిగ్ధం టీడీపీనీ సతమతం చేస్తోంది. నాయకత్వం మీద సన్నగిల్లుతున్న విశ్వాసం చివరకు ఎలాంటి పరిణామాలు చవిచూడాలోననే ఆందోళనకు దారితీస్తోంది.
గతమెంతో ఘనకీర్తి కలవాడా అన్నట్టుగా తెలుగుదేశం చరిత్రలో అనేక మైలురాళ్లున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మలుపుతిప్పిన కీలక నిర్ణయాలున్నాయి. నవ్యాంధ్ర పునాది దశలో వేసిన కీలక అడుగులూ ఉన్నాయి. అవన్నీ గతం అయితే వర్తమానంలో ఎదురవుతున్న సవాళ్లు ఆపార్టీ భవితవ్యం ఎలా ఉంటుందోననే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. అటు రాజకీయంగానూ, ఇటు వ్యవస్థీకృతంగానూ టీడీపీ గతంలో ఎన్నడూ లేనంత గడ్డు స్థితిని ఎదుర్కొంటోంది. చివరకు సీఎం పదవికి దూరం అయ్యి ఏడాది తిరక్కుండానే ఇప్పుడు చంద్రబాబు సొంత రాష్ట్రానికి కూడా దూరమయ్యారు. ఎన్నాళ్లు ఆయన హైదరాబాద్ కే పరిమితం అవుతారన్నది తెలియడం లేదు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా లేని పరిస్థితి ఉత్పన్నమయ్యిందంటే తెలుగుదేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది. కరోనా కారణంగా ఎదురయిన సమస్యే అయినప్పటికీ కష్టకాలంలో ప్రజలకు దూరంగా ప్రతిపక్ష పార్టీ ప్రధాన నేతలు ఉండాల్సి రావడం గమనిస్తే టీడీపీ భవిష్యత్ మీద సందేహలు పెరగకమానవు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినప్పటికీ ప్రతిపక్షంగా టీడీపీకి అనేక అవకాశాలు వస్తున్నాయి. వాటిని వినియోగించుకోగల స్థితిలో ఆపార్టీ లేకపోవడమే ఇప్పుడున్న దుస్థితికి కారణం అవుతోంది. టీడీపీకి తొలినాళ్లలో నాయకత్వం వహించిన వారిలో అనేక మంది చెల్లాచెదరయిపోయారు. ఆతర్వాత చంద్రబాబు నాయకత్వంలో ముందుకొచ్చిన యువతరం కూడా ఎక్కువ కాలం స్థిరంగా నిలబడలేకపోయారు. అన్నింటికీ మించి 2019 ఎన్నికల ఓటమి టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. 2014లో పదేళ్ళ తర్వాత దక్కిన విజయగర్వంతో టీడీపీ పట్టపగ్గాల్లేకుండా వ్యవహరించింది. అధికారం మత్తులో చంద్రబాబు , ఆయన తనయుడు వ్యవహరించిన తీరు టీడీపీని కోలుకోలేని రీతిలో నిలబెట్టింది. చరిత్రలో తొలిసారి సింగిల్ గా బరిలో స్వల్ప ఓట్లను మాత్రమే దక్కించుకుంది. అంతటితో సరిపెట్టుకోకుండా ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయినా తాము ప్రతిపక్షంలో ఉన్నామనే ధ్యాస కూడా లేకుండా వ్యవహరించడంతో మిగిలిన వారిలో అనేకమందిని దూరం చేసుకునేందుకు దోహదం చేస్తోంది.
ప్రజలు పార్టీని దూరం పెట్టగా, నాయకులు పార్టీని వీడేందుకు టీడీపీ నాయకత్వం తీరు కారణంగా కొందరు భావిస్తున్నారు. కీలక సందర్భాల్లో టీడీపీ విధాన నిర్ణయాలు కొంప కొల్లేరు కావడానికి కారణం అవుతున్నాయి. అమరావతి వంటి విషయాల్లో టీడీపీ నాయకత్వం ముందు చూపు ప్రదర్శించలేక ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. ప్రజల్లో టీడీపీ పట్ల పెరిగిన అనుమానాలను మరింత బలపరిచేలా, అనేక ప్రధాన సామాజికవర్గాలను దూరం చేసేందుకు దోహదపడింది. ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకత, కమ్యూనిస్టుల బలహీనత ఆధారంగా పునాదులు ఏర్పరుచుకున్న టీడీపీ అధినేత చివరకు సొంత సామాజికవర్గం మీద జనంలో పెరిగిన వ్యతిరేకతను గ్రహించలేక విలవిల్లాడుతున్నారు. చంద్రబాబు తర్వాత ఎవరూ అనే ప్రశ్నకు సమాధానం లేక చిక్కులు ఎదర్కొంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ మీద సొంత పార్టీలోనే ఎటువంటి విశ్వాసం లేనట్టుగా మారింది. సన్ రైజింగ్ కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి అసలుకే ఎసరు తెచ్చాయి.
ఈ నేపథ్యంలో 1982 మార్చి 29నాడు ఆవిర్భవించి, 9నెలల వ్యవధిలో అధికార పీఠంపై కూర్చున్న టీడీపీకి రాబోయే కాలం అంతా దాదాపుగా గడ్డుకాలంగా మిగలబోతోంది. నాయకత్వ వైఫల్యం, విధానాల అస్పష్టత, క్యాడర్ చేజారిపోవడం, నాయకత్వం దూరం కావడం వంటి అనేక సమస్యలు టీడీపీ మనుగడని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. గతంలో ఇలాంటి అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏటికి ఏదురీదడం అంత సులువు కాదు. కానీ చివరి వరకూ ఎదురొడ్డి నిలవడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఎన్నాళ్లు పోరాడగలరు..టీడీపీని నిలబెట్టగలరు అన్నది ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చర్చనీయాంశమే అవుతుంది. ఇలాంటి పరిస్థితి టీడీపీకి ఎదురుకావడం మాత్రం స్వయంకృతాపరాధమే అనడంలో సందేహం లేదు. మరో రెండేళ్లలో నాలుగు దశాబ్దాల పండుగ జరుపుకోవాల్సిన వేళ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేత చంద్రబాబు తన పార్టీని ఏ దిశలో ముందుకు తీసుకెళతారన్నది చూడాలి.