iDreamPost
android-app
ios-app

పుంగనూరు, మాచర్ల ఏకగ్రీవాలపై టీడీపీ పిటిషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

పుంగనూరు, మాచర్ల ఏకగ్రీవాలపై టీడీపీ పిటిషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్ధతుదారులు ఏకగ్రీవాలపై నానా యాగీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. ఈ అంశంపై హైకోర్టుకు కూడా వెళ్లింది. ఆది నుంచి చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై అభ్యంతరాలు, విమర్శలు చేస్తున్న టీడీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదులు చేసింది.

తాజాగా పంచాయతీ రాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా పుంగనూరు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గమైన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ పిటిషన్లు దాఖలు చేసింది.పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, తమ పార్టీ బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారంటూ టీడీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. టీడీపీ చేస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్, వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం, ఉద్యోగులు మొత్తుకున్నా.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలకే మొగ్గు చూపారు. టీడీపీ కూడా ఆయన నిర్ణయాన్ని సమర్థించింది. ఎన్నికలకు భయపడే వైసీపీ వాయిదా వేయాలని కోరుతోందంటూ విమర్శించింది. ఎన్నికలు ప్రారంభం అయిన తర్వాత కూడా టీడీపీ తన పని తానుచేసుకుపోయింది. తొలి దశ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ వరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌నే ఫాలో అయింది.

తొలి దశలో ప్రతికూల ఫలితాలు రావడంతోపాటు టీడీపీ ఊహించని విధంగా ప్రజలు వైసీపీ బలపర్చిన అభ్యర్థులు గెలవటంతో యూ టర్న్‌ తీసుకుంది. ఎన్నికలు సరిగా నిర్వహించలేదంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది. తొలి దశ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన చంద్రబాబు.. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. వందల కొద్దీ ఫిర్యాదులు చేసినా ఎస్‌ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో జరిగిన ఏకగ్రీవాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి, పిన్నెళ్లి పోటుగాళ్లా.. అంటూ ఫైర్‌ అయ్యారు.

ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై కోర్టులకు వెళతామని ఈ నెల 10వ తేదీన చంద్రబాబు చెప్పారు. దీనికి కొనసాగింపుగానే.. తాజాగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. టీడీపీ చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని పరిశీలించి, తగిన విధంగా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ఎస్‌ఈసీ కలెక్టర్లను నివేదిక కోరే అవకాశం ఉంది. ఆయా పంచాయతీల వారీగా సమగ్రమైన నివేదికలు తెప్పించుకున్న తర్వాత.. టీడీపీ ఫిర్యాదుల్లో నిజానిజాలెంత..? అనేది ఎస్‌ఈసీ తేల్చనుంది. తొలి విడతలో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయంటూ వాటిని తాత్కాలికంగా నిలిపివేసిన ఎస్‌ఈసీ.. ఆ తర్వాత కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. నివేదికలు పరిశీలించిన తర్వాత పోలింగ్‌ ముందు రోజు రాత్రి ఏకగ్రీవాలను ధృవీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా అంశంలోనూ ఇదే పంథాలో ఎస్‌ఈసీ వ్యవహరించే అవకాశం ఉంది.