iDreamPost
android-app
ios-app

Muncipal Nominations, Chandrababu, TDP – అడ్డుకుంటే.. అన్ని నామినేషన్లు ఎలా వేశారు బాబూ..?

Muncipal Nominations, Chandrababu, TDP  – అడ్డుకుంటే.. అన్ని నామినేషన్లు ఎలా వేశారు బాబూ..?

ఎన్నిక ఏదైనా సరే.. చంద్రబాబు మాత్రం నామినేషన్ల నుంచి గొడవ చేయడం ప్రారంభిస్తున్నారు. అధికార పార్టీని, పోలీసులు, ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగాన్ని నిందిస్తూ.. ఎన్నికల్లో అక్రమాలు జరిగిపోతున్నాయనేలా మీడియా ముందు హడావుడి చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందనే భావనను ప్రజల్లో కల్పించేందుకు శతఃవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ తంతు తాజాగా జరుగుతున్న నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల ఎన్నికల్లోనూ చంద్రబాబు కొనసాగిస్తున్నారు.

ఈ నెల 5వ తేదీతోనే మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినా.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ నానా యాగీ చేస్తున్నారు. ‘‘ వైసీపీ వాళ్లు దౌర్జన్యం చేశారు.. బెదిరించారు.. నామినేషన్‌ పత్రాలు చించివేశారు.. వైసీపీ దౌర్జన్యాలకు అంతేలేదా..?’’ అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు.

ఐదు రోజులుగా చంద్రబాబు పదే పదే చెబుతున్న ఈ మాటలు విన్న వారికి నిజంగా.. వైసీపీ వాళ్లు దౌర్జన్యం చేస్తున్నారా..? టీడీపీ వాళ్లను కనీసం నామినేషన్లు కూడా వేయనీయడంలేదా..? ఇదేం ప్రజాస్వామ్యం..? అనుకునే అవకాశం లేకపోలేదు. ఒక అబద్ధాన్ని చెప్పిందే.. చెప్పి.. నిజమని నమ్మించొచ్చని చంద్రబాబు నమ్మకమని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెప్పే మాట. అదే పంథాను ఇప్పటికీ చంద్రబాబు కొనసాగిస్తున్నారు. కానీ అందులో ఎంత మాత్రం వాస్తవం ఉండదని తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ తరఫున దాఖలైన నామినేషన్లకు, చంద్రబాబు చెబుతున్న మాటలకు ఏ మాత్రం పొంతన లేకపోవడమే నిదర్శనం.

Also Read : MLC Elections TDP – ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరం ?

అధికార వైసీపీ కంటే.. టీడీపీ అభ్యర్థులే మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువగా నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేయకుండా మా అభ్యర్థులను అడ్డుకున్నారని చంద్రబాబు పదే పదే.. నెల్లూరు కార్పొరేషన్, కుప్పం, దర్శి మున్సిపాలిటీల పేర్లను ప్రస్తావిస్తున్నారు. కానీ వాస్తవంగా అక్కడ బాబు చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు గాను మొత్తం 471 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో టీడీపీ దాఖలు చేసిన నామినేషన్లే ఎక్కువ. ఆ పార్టీ మొత్తం 141 నామినేషన్లు దాఖలు చేసింది. అధికార వైసీపీ కేవలం 109 నామినేషన్లను మాత్రమే వేసింది. ఇక కుప్పం మున్సిపాలిటీల 25 వార్డులు ఉండగా.. 240 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీడీపీ తరఫున 126 నామినేషన్లు దాఖలు కాగా.. వైసీపీ తరఫున 89 మాత్రమే దాఖలయ్యాయి. ప్రకాశం జిల్లా దర్శిలో 20 వార్డులకు 147 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో టీడీపీవి 44, వైసీపీవి 50 నామినేషన్లు ఉన్నాయి.

బాబు ప్రస్తావిస్తున్న ఈ మూడు చోట్లనే కాకుండా.. ఇతర మున్సిపాలిటీలలోనూ టీడీపీనే అత్యధిక నామినేషన్లు దాఖలు చేసింది. గుంటూరు జిల్లా పల్పాడు ప్రాంతం దాచేపల్లిలో 20 వార్డులకు మొత్తం 118 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో టీడీపీ 53 నామినేషన్లు దాఖలు చేయగా.. వైసీపీ 42 నామినేషన్లనే వేసింది. గురజాలలో 20 వార్డులకు 81 నామినేషన్లు దాఖలు కాగా.. వైసీపీ 38, టీడీపీ 31 చొప్పన నామినేషన్లు దాఖలు చేశాయి. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి , పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం, రాజంపేట, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, కర్నూలు జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లా పెనుగొండ, మున్సిపాలిటీల్లోనూ టీడీపీ అక్కడ ఉన్న వార్డులకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేసింది. మరి చంద్రబాబు చెబుతున్నట్లు వైసీపీ వాళ్లు అడ్డుకుంటే, దౌర్జన్యం చేస్తే.. ఇన్ని నామినేషన్లు టీడీపీ అభ్యర్థులు ఎలా దాఖలు చేశారో ఆయనే చెప్పాలి.

Also Read : Nellore Corporation -నేతల తప్పులు.. నెల్లూరులో టీడీపీకి చిక్కులు