iDreamPost
iDreamPost
రాష్ట్రంలో చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న టీడీపీ పెద్దగా సఫలం కావడంలేదు. నియోజకవర్గాల్లో పార్టీని గాడిలో పెడదామనుకుంటున్నా సరైన నాయకులు దొరకని దుస్థితి నెలకొంది. ఇతర జిల్లాల సంగతి ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనే పలు నియోజకవర్గాలు కొరకరాని కొయ్యలా తయారయ్యాయి. వాటిలో పూతలపట్టు ఒకటి. ఇక్కడ మొదటి నుంచీ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. పార్టీని నడిపించే నాథులు కూడా లేరు. ఇంఛార్జి నియామకానికి అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఒక్కసారి కూడా గెలవని టీడీపీ
పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ టీడీపీ ఒక్కసారైనా గెలవలేదు. గతంలో బంగారుపాలెం, తవనంపల్లి నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న పూతలపట్టు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. 2009లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమితో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి బాగా దిగజారిపోయింది. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు సైతం చేపట్టేవారు లేకుండా పోయారు.
లలిత రాజీనామాతో పూర్తిగా పతనం
గత ఎన్నికల ముందువరకు మాజీ ఎమ్మెల్యే ఎల్.లలితకుమారి పార్టీకి పెద్దదిక్కుగా ఉండేవారు. 2004లో పలమనేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పూతలపట్టుకు మారారు. 2009 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడి పరాజయం పాలయ్యారు. అప్పటికే రెండుసార్లు ఓడిపోయిన లలితకుమారికి గత ఎన్నికల్లో చంద్రబాబు మొదట టికెట్ నిరాకరించారు. పూర్ణం అనే అభ్యర్థిని ప్రకటించారు. చివరి నిమిషంలో మనసు మార్చుకుని మళ్లీ లలితను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం. ఎస్.బాబు చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమిభారంతో పాటు టికెట్ ఇచ్చే విషయంలో తన పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురైన లలితకుమారి 2020 మార్చిలో టీడీపీకి రాజీనామా చేశారు. దాంతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ జెండా పట్టుకునే నేతలే కరువయ్యారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దారుణ పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ పార్టీకి గడ్డు పరిస్థితి తప్పదని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.