iDreamPost
android-app
ios-app

టీడీపీ ఆ పని మానేసిందట.. ఆ విషయం మరచిపోయిందట..

టీడీపీ ఆ పని మానేసిందట.. ఆ విషయం మరచిపోయిందట..

తెలుగు రాష్ట్రాలలో బలపడాలనుకుంటున్న భారతీయ జనతాపార్టీ (బీజేపీ) తెలంగాణలో లక్ష్యం వైపు వేగంగా సాగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల తర్వాత మూడో బలీయమైన శక్తిగా బీజేపీ తెలంగాణలో అవతరించిందని చెప్పవచ్చు. 2019 సాధారణ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు తెలంగాణలో ఆ పార్టీ ముద్రను తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం 2023 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది.

తెలంగాణతో పోల్చితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ బాగా వెనకబడిందని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ నోటాతో పోటీ పడింది. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడును ప్రకటించి.. గేర్‌ మార్చింది. కొత్త అధ్యక్షుడు స్పీడ్‌ పెంచుతున్నా.. పరిస్థితులు మాత్రం పెద్దగా అనుకూలించడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండో స్థానంపైనే బీజేపీ దృష్టిపెట్టింది. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటనలతో అసలు లక్ష్యం ఏమిటో స్పష్టమైంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఉన్నా.. ప్రతిపక్ష పార్టీ స్థానం ఖాళీగా ఉందంటూ బీజేపీ నేతలు వరుస ప్రకటనలు చేశారు. ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ప్రకటనలను సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు చేస్తున్నారు.

Also Read : బీజేపీతో ‘గాంధీ’ల బంధం ముగియనున్నదా ?

ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలేదన్నారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు (జీవీఎల్‌). ఆ పార్టీ కేవలం మీడియా సమావేశాలకే పరిమితం అవుతోందన్నారు. ప్రజా సమస్యలపై రోడ్లపైకి వచ్చి పోరాటం చేయడం మానేసిందన్నారు. పోరాటాలతోపాటు ఎన్నికల్లో పోటీ చేయడం కూడా మరచిపోయిందని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదని గుర్తు చేశారు. తాజాగా బద్వేలు ఉప ఎన్నికల్లోనూ టీడీపీ మిడిల్‌ డ్రాప్‌ అయింది. నోటిఫికేషన్‌ రాకముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ.. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పోటీ చేయడంలేదని ప్రకటించింది. టీడీపీ వ్యవహరిస్తున్న తీరు.. బీజేపీ నేతలకు అవకాశాలను కల్పిస్తోంది.

బీజేపీ నేతల ప్రకటనలు ఎలా ఉన్నా.. ఆ పార్టీ పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కొత్త నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. సోము అధ్యక్షుడైన తర్వాత ఇతర పార్టీలలో ప్రాధాన్యత దక్కని వారు.. కమలం కండువా కప్పుకున్నారు. కొద్ది రోజులు చేరికలతో బీజేపీలో ఊపు కనిపించినా.. ఆ తర్వాత చేరికలు ఆగిపోయాయి. సోము వీర్రాజు రాష్ట్రమంతా తిరిగి ఆహ్వానిస్తున్నా.. నేతలు ఆసక్తి చూపడంలేదు. దీనికి ఏపీ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రధాన కారణంగా నిలుస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ..రెండో స్థానం ఆశించింది. జనసేన మద్ధతుతో పోటీలో నిలిచినా.. అనుకున్న ఫలితం రాలేదు. తాజాగా బద్వేలు ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. దాదాపు ఏడాదిన్నరగా ఏపీలో బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలను ఇవ్వకపోయినా.. ఆ పార్టీ నేతలు మాత్రం పట్టు విడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో..? చూడాలి.

Also Read : ప‌వ‌న్ కు మిత్రుడు టీడీపీనా, బీజేపీనా?