iDreamPost
android-app
ios-app

రాజ్యాంగం.. హక్కులు ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా?

  • Published Feb 10, 2022 | 2:51 PM Updated Updated Mar 11, 2022 | 10:18 PM
రాజ్యాంగం.. హక్కులు ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా?

తాము అధికారంలో ఉండగా రాజ్యాంగానికి, నిబంధనలకు, వ్యక్తి హక్కులకు విలువ ఇవ్వని టీడీపీ నాయకులు ఇప్పుడు మాత్రం ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్న ఈ సమయంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుపడుతూ దాన్ని ఓ ఇష్యూగా మార్చాలని చూస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎప్పటిలాగే రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ప్రభుత్వంపై నిందలు వేశారు.

శుద్ధపల్లిలో అక్రమ క్వారీయింగ్‌ జరుగుతోందని ఆరోపిస్తూ దీక్ష చేస్తున్న దూళ్లిపాళ్ల నరేంద్ర వద్దకు టీడీపీ నాయకులను ఎవ్వర్నీ వెళ్లనీయడం లేదని ఆవేశపడిపోయారు. మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావుని ముందస్తు అరెస్టు చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అన్నారు. ఆర్టికల్ 19 ద్వారా కల్పించిన తిరిగే హక్కును ప్రభుత్వం హరించి వేస్తోందని మైలవరం నుంచి వడ్లమూడి వెళ్తున్న తనను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం విచారకరం అన్నారు.

మీ హయాంలో నిబంధనలను నీళ్లు వదలలేదా?

ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖపట్నంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన నాటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌ పోర్టులోనే నిలువరించి వెనక్కి పంపేసినప్పడు ఆర్టికల్ 19 టీడీపీ పాలకులకు గుర్తు లేదా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారం నాటి ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు? ఒక ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన రీతిలో వందలాది మంది పోలీసులను మోహరించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని అరెస్ట్‌ చేసినప్పుడు నిబంధనలు ఏమయ్యాయి? ముద్రగడతో మాట్లాడడానికి వెళుతుంటే బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావు,  వంటి ప్రముఖులను ఎందుకు అడ్డుకున్నారు? అని అధికార పార్టీ నేతలు అడుగుతున్నారు. టీడీపీ నేతల దృష్టిలో తాము చేస్తే పరిపాలన.. ఎదుటివారు చేస్తే అరాచకమూనా? అని ప్రశ్నిస్తున్నారు.

ఏం ముడిపెట్టేశారు!

ఉద్యోగులు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో చేపట్టిన ర్యాలీతో ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని.. అందుకే తనను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఉమా చేసిన వ్యాఖ్య మరీ విడ్డూరంగా ఉంది. కొంతమంది ఉద్యోగులు ర్యాలీ చేస్తే విశేష జనాదరణతో, తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు పుడుతుంది? ఒకవేళ అది నిజమే అనుకున్నా ఉమాను అడ్డుకోవడానికి, దీనికి సంబంధం ఏమిటి? ప్రభుత్వాన్ని రోజూ విమర్శించాలన్న యావలో పడి తాము ఏం మాట్లాడుతున్నారో కూడా మాజీ మంత్రి ఉమాకు అర్థం కావడం లేదా? అని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

Also Read : ఎందుకు దీక్ష చేస్తున్నారో మీకైనా తెలుసా ఉమా?