iDreamPost
android-app
ios-app

ప‌ర‌నింద రాజ‌కీయాలు స‌రే.. పార్టీ ప‌రిస్థితేంటి?

ప‌ర‌నింద రాజ‌కీయాలు స‌రే.. పార్టీ ప‌రిస్థితేంటి?

ప్ర‌స్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి మరింత దారుణంగా తయారైపోతోంది. ఓ వైపు వ‌రుస ఓట‌ములు కుంగ‌దీస్తుంటే, మరోవైపు.. సొంత పార్టీ నుంచి కూడా తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రతిసారీ కొత్త సమస్య వచ్చి పడుతూనే ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన భారీ దెబ్బ నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆ తర్వాత మునిసిపల్ పోరులోనూ సైకిల్ పంక్ఛర్ అయిపోయింది. పంచాయతీల్లో 85 శాతానికిపైగా మునిసిపాలిటీల్లో 99 శాతం స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ.. తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఆ విధంగా జగన్ తనకు తిరుగులేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో మ‌న పార్టీ బ‌తికిబ‌ట్ట‌గ‌ట్టాలంటే ఏం చేయాల‌నే దానిపై చ‌ర్చించాల్సింది పోయి.. ప‌రాయి పార్టీ గురించే ఎక్కువ‌గా చ‌ర్చిస్తోంది టీడీపీ. మ‌హానాడులోనూ ఇప్పుడు అదే జ‌రుగుతోంది.

ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం కోల్పోతే తిరిగి ఎలా సంపాదించుకోవలో ఆలోచిస్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం పరనిందకే పరిమితమ‌వుతోంది. మహానాడులో కూడా ప్రభుత్వంపై పెట్టిన తీర్మానాలే ఎక్కువ‌. కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నారో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో, ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో.. వంటి అంశాల‌పై చ‌ర్చించ‌కుండా అధికార పార్టీపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌కే మ‌హానాడులో ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు.

మేనిఫెస్టోలో 94.5 శాతం వాగ్దానాలు నెర‌వేర్చిన అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో ఎన‌లేని అభిమానం ఉన్న‌ట్లు ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఆ పార్టీని విమ‌ర్శంచ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని, తాము ఎలా ప్ర‌జ‌ల న‌మ్మ‌కం పొందాలో ఆలోచిస్తే మేల‌ని టీడీపీ వ‌ర్గాలు భావించ‌డం అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలు, ప్రజాసంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు విప‌రీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమంలో జగన్ టాప్ ర్యాంక్ సాధిస్తున్నారు. రెండేళ్ల పరిపాలన పూర్తికాకముందే మేనిఫెస్టోలోని 129లో 107 (94.5 శాతం) వాగ్దానాలను నెరవేర్చినట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ రెండేళ్లలో రూ.1.25 లక్షల కోట్లను అవినీతికి తావులేకుండా ప్రజలకు నేరుగా అందించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆర్థిక, సామాజిక విప్లవానికి, మహిళా సాధికారతకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. 40 ఏళ్ల అనుభవం చేయలేనిది, 40 ఏళ్ల యువ నాయకుడు చేశార‌న్న పేరు పొందుతున్నారు. ఇటువంటి క్ర‌మంలో ఆయ‌న‌ను, వైసీపీని విమ‌ర్శిస్తూ మాట్లాడినా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప‌రిస్థితి లేదు. త‌మ త‌ప్పుల‌ను ఒప్పుకుని మ‌రోసారి పున‌రావృతం కాకుండా చూసుకుందామ‌ని ఆత్మ విమ‌ర్శ చేసుకుంటేనే టీడీపీకి మేల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.