తెలుగుదేశం “గంట‌”పురాణం

ఒక గుడిలో గంట దొంగ‌త‌నం జ‌రిగింది.
దొంగ‌ని పోలీసులు ప‌ట్టుకున్నారు.
“గంట‌ని ఎందుకు కొట్టేశావ్?” అని అడిగారు.
“నేను ఆ దారిలో వెళుతూ ఉంటే గోపురం క‌నిపించింది. త‌ర్వాత ధ్వ‌జ‌స్తంభం చూశాను. భ‌క్తితో లోప‌ల‌కి వ‌చ్చాను. దేవుడికి దండం పెట్టుకున్నా. పూజారి హార‌తి ఇచ్చాడు….”

“అరే బాబూ , మేము అడిగింది ఆల‌య పురాణం కాదు, గంట‌ని ఎందుకు దొంగ‌త‌నం చేశావు అని?…” అడిగారు పోలీసులు.
“హార‌తి త‌ర్వాత ప్ర‌సాదం ఇచ్చారు. ఉడికించిన సెన‌గ‌లు, కానీ స‌రిగా ఉడ‌క‌లేదు. సెన‌గ‌ల్లో ప్రొటీన్లు ఉంటాయి. వాస్త‌వానికి మ‌నం తినే స్వీట్లు చాలా భాగం సెన‌గ‌ల వ‌ల్లే వ‌స్తాయి. అందువ‌ల్ల ప్ర‌సాదంలో మార్పులు చేయాల‌ని క‌మిటీకి సూచ‌న‌లు ఇస్తాం…”

“అరే, నీకేమైనా మెంట‌లా…మేము అడిగింది గంట‌ని ఎందుకు దొబ్బావు అని” కొంచెం కోపంగా అడిగారు పోలీసులు.
“సార్‌, అదే చెబుతున్నా. వాస్త‌వం చెబితే మెంట‌ల్ అంటారేంటి? ఈ లోకమే ఒక పిచ్చాస్ప‌త్రి అన్నారు. ఒక‌సారి పిచ్చి ప‌డితే వైజాగ్‌, లేదా హైద‌రాబాద్‌కి ట్రీట్‌మెంట్‌కి వెళ్లాలి. ఎర్ర‌గ‌డ్డ అనే ఏరియాలో ఈ మెంటల్ ఆస్ప‌త్రి ఉంది. కావాలంటే గూగుల్‌లో చూసుకోండి”

పోలీసులు లాఠీతో బుర్ర గోక్కొని “ఒరేయ్ , ఎందుకురా చంపుతున్నావ్‌. మేము అడిగింది ఏమిటి? నువ్వు చెప్పేదేమిటి? గుడి అంటే ఆల‌యం. అక్క‌డ భ‌క్తుల కోసం గంట ఏర్పాటు చేస్తే దాన్ని చోరీ ఎందుకు చేశావు? స్ప‌ష్టంగా చెప్పాం. సూటిగా స‌మాధానం చెప్పు?” అన్నారు.

“తాళం పుట్టిన‌ప్పుడే దొంగ‌లు పుట్టారు. దొంగ‌లు పుట్టిన‌ప్పుడే తాళం పుట్టింది. చాలా మంది రాగం, తాళం అంటారు కానీ, అది త‌లుపుల‌కు వేసే తాళం కాదు, తానం….” ఇంకా ఏదో చెప్ప‌బోతుంటే SI వ‌చ్చాడు.
“చూడండి సార్‌, ఎలా వేధిస్తున్నాడో…” అన్నారు పోలీసులు.

దొంగ‌ని ఎగాదిగా చూసి “నువ్వు చంద్ర‌బాబునాయుడి అనుచ‌రుడివి క‌దా?” అని అడిగాడు SI.
“మీకెలా తెలుసు సార్” ఆశ్చ‌ర్యంగా అడిగాడు దొంగ‌.
“అసెంబ్లీలో చూశా క‌దా అమ‌రావ‌తి మారుమూల ప్రాంతాల్లో భూముల్ని ఎందుకు కొన్నార‌ని అడిగితే ఒక్క‌రైనా స‌రైన స‌మాధానం చెప్పారా? రాజ‌ధాని ఎక్క‌డొస్తుందో తెలియ‌కుండా వేల ఎక‌రాలు కొన్న అమాయ‌కులు మీ పార్టీ వాళ్లు” అని SI లాఠీతో ఒక్క‌టి పీకాడు.
గంట టంగ్‌మ‌ని మోగింది.

Show comments