iDreamPost
android-app
ios-app

రామతీర్థం ఘటన – టీడీపీది అవకాశవాద రాజకీయం

రామతీర్థం ఘటన – టీడీపీది అవకాశవాద రాజకీయం

విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రం వేదికగా ప్రస్తుతం ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో చతికిలపడి ఉన్న తెలుగుదేశం ఈ ఘటనను ఆసరాగా చేసుకుని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా హిందూత్వ రాజకీయాలను చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుంది. రాష్ట్రంలో వైసీపీతో పాటు మరోపక్క బీజేపీ టీడీపీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. టీడీపీని వెనక్కి నెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. తామే ప్ర‌తిప‌క్షం అని చెప్పుకుంటోంది. ఈ క్రమంలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా అయినా నిల‌బెట్టుకోవాలన్నా.., తమ ఉనికి కాపాడుకోవాలన్నా ఏదో ఒక విధంగా ప్ర‌జ‌ల‌లో ఉండాల‌ని ఎప్పటి నుంచో టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో రాముడి విగ్రహం ఘటననే అందుకు ఎంచుకుందా..? అంటే అవును అనే స‌మాధానం వ‌స్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ కంటే ముందుగానే ఆలయ సందర్శనకు ప్లాన్‌ చేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా బీజేపీకి మించి కాషాయికరణ జపం చేస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు కూడా అదే పంథా అవలంబిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ సంక్రాంతి కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ఇళ్ల పట్టాల కోలాహలమే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో సున్నితమైన అంశాన్ని ఎంచుకుంటే తప్పా ప్రజల దృష్టిని మరల్చడం సాధ్యం కాదని ఉద్దేశపూర్వకంగానే దేవాలయాలపై దాడులను టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

హిందూత్వ రాజ‌కీయ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ అంతర్వేది ర‌థం ద‌గ్ధం సంఘ‌ట‌న‌లో చేసిన ఆందోళనలు తెలిసిందే. హిందూ సంఘాలను కూడ‌గ‌ట్టుకుని తీవ్ర స్థాయిలో హంగామా సృష్టించ‌డంతో అప్ప‌ట్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. త‌మ పార్టీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై బీజేపీ వెంట‌నే స్పందిస్తుంది. విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థం ఘ‌ట‌న‌లో మాత్రం కాస్త వెనుక‌బ‌డినట్లుగానే క‌నిపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌దిత‌ర కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ ఈ విష‌యంలో తెలుగుదేశం యాత్ర‌కు ముందుగానే శ్రీ‌కారం చుట్టి క్రెడిబిలిటీ పొందేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. చంద్ర‌బాబు రాజ‌కీయ ల‌క్ష్యంగా బెడిసికొట్టింది. ఆయ‌న విజ‌య సంకేతాలు చూపిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆరోప‌ణ‌ల‌కు, యాత్ర ల‌క్ష్యాన్ని తిప్పికొట్ట‌డంలో వైసీపీ నేత‌లు స‌క్సెస్ అయ్యారు. దీంతో ఆయ‌న యాత్ర‌కు అంత‌గా క్రేజు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న సంక్షేమ ఫ‌లాల జోరును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ప్ర‌తిప‌క్షాలు దీన్ని ఓ ఆయుధంగా ఎంచుకున్నాయి. వైసీపీ కూడా ప్ర‌తిప‌క్షాల‌కు గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇస్తోంది. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ముందే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కొండ మీదికి చేరుకుని ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న‌పై కారుపై టీడీపీ నాయ‌కులు రాళ్లపై దాడి చేశారు. ఇది ఆ పార్టీపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపించింది. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు.

ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌డు జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ యాత్ర‌కు పిలుపునిచ్చింది. ఈ ఘ‌ట‌న‌ను ఆ రెండు పార్టీలు ఇదివరకే ఖండించాయి. తాజాగా ఇరు పార్టీలు ఈ నెల 5వ తేదీన రామతీర్థ ధర్మ యాత్ర చేపట్టాలని నిర్ణయించాయి. 5 వ తేదీ ఉదయం 11 గంటలకు జనసేన నాయకులు, శ్రేణులు బి.జె.పి. నేతలతో యాత్రగా తరలి వెళ్ళి ఆలయాన్ని సందర్శిస్తారు. ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆ పార్టీ నేత‌లు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాలయాలపై దాడుల వ్యవహారం పతాకస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ – జ‌న‌సేన చ‌లో రామ‌తీర్థం కార్య‌క్ర‌మానికి పిలుపు నివ్వ‌డంతో పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. బందోబ‌స్తును పెంచింది.